Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం విచారణ బృందం నివేదిక
న్యూఢిల్లీ : గత నెలలో జరిగిన దేశ తొలి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి మేఘాల వాతావరణంలో పైలట్ తప్పిదమే కారణమని విచారణ బృందం తన ప్రాధమిక విచారణలో కనుగొంది. 'లోయలో వాతావరణ పరిస్థితుల్లో ఆకస్మిక మార్పుతో హెలికాప్టర్ మేఘాల్లోకి ప్రవేశించిన ఫలితంగా ప్రమాదం సంభవించింది. వాతావరణ మార్పుతో ప్రదేశాలను గుర్తించడంలో పైలట్ అయోమయానికి గురయ్యాడు. దీంతో హెలికాప్టర్ కంట్రోల్డ్ ఫైట్ ఇన్‌టో టెర్రైన్ (సిఎఫ్‌ఐటి) మోడ్‌లోకి వెళ్లిపోయింది' అని విచారణ బృందం తెలిపింది. ఫ్లయిట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లను విశ్లేషించడంతో సహా అందబాటులో ఉన్న ప్రత్యక్ష సాక్షులందరినీ విచారించిన తరువాత బృందం ఈ విషయాన్ని తెలియజేసింది. పైలట్ నియంత్రణలోనే ఉన్న విమానం అకస్మాత్తుగా భూభాగం, నీరు, పర్వతాలను ఢకొట్టెడాన్ని సిఎఫ్‌ఐటిగా అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఎటిఎ), అమెరికా ఫెడరల్ వైమానిక అడ్మినిస్ట్రేషన్ నిర్వచనం ఇస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో విమాన ప్రమాదాలకు ఇదే అత్యధిక కారణంగా వైమానిక నిపుణులు చెబుతుంటారు. గత ఏడాది డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులతోపాటు 14 మంది మరణించిన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదంపై దేశంలోని అగ్రశ్రేణి హెలికాప్టర్ పైలట్ ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్ నేతత్వంలోని ట్రై సర్వీసెస్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ తన ప్రాథమిక నివేదికను శుక్రవారం సమర్పించింది. ప్రమాదానికి యాంత్రిక లోపం, విధ్వంసం, నిర్లక్ష్యం కారణం కాదని స్పష్టం చేసింది.