Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న ఆహార సంక్షోభం!
- దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి
- మోడీ పాలనలో రైతన్నల జీవితాలు అగమ్యగోచరం
న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నాయి. ఇటు అన్నదాతలనే కాకుండా యావత్ దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకవైపు వ్యవసాయ విస్తీర్ణం తగ్గుతున్నది. ఫలితంగా పంట దిగుబడి తగ్గి ఆహార సంక్షోభం పెరుగుతున్నది. దేశంలో ఈ పరిస్థితులు ఇప్పుడు ఆందోళనను కలిగిస్తున్నాయి. కేంద్రం అనుసరిస్తున్న కఠిన విధానాలతో ఈ రంగంలో ఏర్పడిన సమస్యల కారణంగా దేశంలోని రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారు. ఇది దేశంలో ఆహార భద్రతకు ముప్పును పెంచుతుందని నిపుణులు హెచ్చరించారు. మోడీ సర్కారు విధానాలతో రైతన్నల జీవితాలు ఆందోళనకరంగా మారాయన్నారు.
వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ప్రధాన మంత్రి నిర్ణయించి కొన్ని రోజులు గడుస్తున్నది. ప్రధాని నిర్ణయంతో విజయం సాధించిన రైతన్నలు దాదాపు ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న తమ దీక్షలను విరమించారు. స్వస్థలాలకూ చేరుకున్నారు. అయితే, వ్యవసాయంరంగం ఎదుర్కొంటున్న సవాళ్లు మాత్రం అలాగే ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న జనాభాకు వ్యవసాయం నుంచి ఆహారాన్ని అందించడం అనేక సవాళ్లలో ప్రధానమైనదని నిపుణులు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని అన్నదాతలు వ్యవసాయానికి దూరమవుతున్నారు. పట్టణాలకు వలసలు పెరిగాయి. దీంతో వ్యవసాయం రంగంలో శ్రామికశక్తి తగ్గుతున్నది. ఫలితంగా ప్రజలందరికి ఆహారం అందడం కష్టంగా మారిందని నిపుణులు చెప్పారు. ఇది మాత్రమే కాదు.. వ్యవసాయ భూమి క్షీణించడం భారతదేశ సామాజిక-ఆర్థిక నిర్మాణాన్ని కూడా ప్రభావితం చేస్తున్నదన్నారు. దేశంలో ఏటా సాగు భూమి తగ్గుముఖం పడుతున్న విషయం వాస్తవేమేనని భూ వనరుల శాఖ కూడా వెల్లడించడం గమనార్హం. దేశంలో జనాభా పెరుగుదల కారణంగా ఆహారానికి డిమాండ్ పెరుగుతున్నదని 'వెస్ట్‌ల్యాండ్ అట్లాస్ 2019, 'మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్', 'ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లు కూడా ధృవీకరించాయి. ఇలాంటి తరుణంలో ఆహార భద్రత విషయంలో ప్రపపంచంలోని ఇతర దేశాలపై మనం ఆధారపడటం పెరుగుతుందనే భయాన్ని విస్మరించలేమని నిపుణులు హెచ్చరించారు.
సాగు భూమిలో తగ్గుదల
'వెస్ట్‌ల్యాండ్ అట్లాస్ 2019' ప్రకారం.. పంజాబ్ వంటి వ్యవసాయ రాష్ట్రంలో సాగు భూమి 14 వేల హెక్టార్లు, పశ్చిమ బెంగాల్లో 62 వేల హెక్టార్లు తగ్గింది. అలాగే, యూపీలో ఈ సంఖ్య అత్యంత ఆందోళనకరంగా అనిపించవచ్చు. ఇక్కడ అభివృద్ధి పనులపై ప్రతి ఏడాది 48 వేల హెక్టార్ల వ్యవసాయ భూమి తగ్గిపోతోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఇండ్లు, ఫ్యాక్టరీలు, రోడ్ల కోసం సారవంతమైన పొలాలను సేకరిస్తున్నారు. వ్యవసాయ భూమి తగ్గడంతో తలసరి ఆదాయం తగ్గుదల, నిరుద్యోగ రేటు పెరగుదల నమోదవుతున్నది. ఎంఎన్ఆర్ఈజీఏ కింద కూలీలు వ్యవసాయం కాకుండా ఇతర పనులలో నిమగమవుతున్నారు. దీంతో పొలాల్లో వ్యవసాయ కూలీలు తగ్గిపోతున్నారు. ఫలితంగా రైతులు వ్యవసాయం నుంచి తప్పుకోవాల్సి వస్తున్నది.
గ్రామస్థుల చేతుల్లోంచి పోతున్న భూమి
1992లో గ్రామీణ కుటుంబాలు 117 మిలియన్ హెక్టార్ల భూమిని కలిగి ఉండగా, అది 2013 నాటికి కేవలం 92 మిలియన్ హెక్టార్లకు తగ్గింది. కేవలం రెండు దశాబ్దాల వ్యవధిలో 22 మిలియన్ హెక్టార్ల భూమి గ్రామీణ కుటుంబాల చేతుల్లోంచి పోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే 2023 నాటికి దేశంలో 80 మిలియన్ హెక్టార్లకు సాగు విస్తీర్ణం తగ్గుతుందని అంచనా. 2031 నాటికి దేశ జనాభా 150 కోట్లుగా ఉంటుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, వారందరికీ ఆహార భద్రత ఎలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వ్యవసాయ రంగాన్ని విస్మరించకుండా ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
'' దేశవ్యాప్తంగా రైతుల ఆదాయంలో పెరుగుదల ఆశించినంతగా లేదు. రైతులు అప్పుల పాలవుతున్నారు. అనేక రాష్ట్రాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి'' అని వివరించారు. పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో సగటున 65 శాతం మంది రైతులు అప్పులపాలయ్యారని 'నేషనల్ శాంపిల్ సర్వే' గణాంకాలు చెప్తున్నాయి. అప్పుల కారణంగా రైతుల బలవన్మరణాలూ పెరుగుతున్నాయి. రైతులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాలే ఇవే కావడం గమనార్హం.