Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : చంటి బిడ్డలకు తల్లిపాలు ఎంతో మేలు చేస్తాయి. ఇది తెలిసిన విషయమే కదా అనుకుంటాం. కానీ సమస్య ఇక్కడే ఉంది. ఇంట్లో అయితే వారికి అలవాటు పడ్డ వాతావరణంలో బిడ్డలకు స్వేచ్ఛగా పాలిచ్చే తల్లులు.. బహిరంగంగా కొన్ని సందర్భాల్లో పసిబిడ్డలకు పాలు ఇవ్వాల్సి వస్తోంది. ఆ సమయంలో.. కొంత మంది కామాంధులు ఆ ఫోటోలు తీసి మహిళల్ని వేధిస్తున్నారు. ఇటువంటి వేధింపులను అడ్డుకట్ట వేసేలా ఇంగ్లాండ్, వేల్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. చనుబాలు పడుతున్న తల్లుల ఫోటోలు/వీడియోలు వారి అనుమతి లేకుండా తీస్తే రెండేళ్ల జైలు శిక్ష పడేలా చట్టాల్లో సవరణ చేశాయి. ఇటువంటి అభ్యంతరకర సందర్భాలను సాధారణ తల్లులే కాదు.. యుకె పార్లమెంట్ సభ్యురాలు స్టెల్లా క్రిసి, పాపులర్ డిజైనర్ జులియా కూపర్ వంటి మహిళలు కూడా ఎదుర్కొన్నారు. స్టెల్లా నార్త్ లండన్లో ఓ సారి రైలులో వెళ్తూ తన చంటి బిడ్డకు పాలిస్తుండగా.. ఓ వ్యక్తి తన అనుమతి లేకుండా ఫోటో తీశాడట. ఇక జులియా కూడా ఇటువంటి ఓ సందర్భాన్ని ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇది నేరం కాదని కేసు నమోదు చేయలేదు. ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తేవాలనుకున్న వీరు... మరికొందరితో కలిసి 'స్టాప్ ది బ్రెస్ట్ పెస్ట్స్' పేరుతో తల్లులపై వేధింపులకు వ్యతిరేకంగా డిజిటల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. సంతకాల సేకరణ చేపట్టారు.