Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
- అంతంతమాత్రంగానే పరీక్షలు
- మరో 4,570 మందికి వైరస్
అమరావతి : కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో రేపటి (మంగళవారం) నుండి రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూను విధించనున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. రాత్రి 11 గంటల నుండి తెల్లవారు జాము 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఆ సమయంలో ప్రజల కదలికలతో పాటు, వాహనాల రాకపోకలపై కూడా ఆంక్షలు అమలుకానున్నాయి. వాస్తవానికి ఈ నెల 11వ తేది నుండి కర్ఫ్యూను అమలు చేయాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నుండి కర్ఫ్యూను పూర్తిస్థాయిలో అమలు జరుపుతామని అధికారులు అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. తాజాగా 24 గంటల కాలంలో (శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం) వరకు రాష్ట్రంలో 4,570 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య ( యాక్టివ్ కేసులు) 26,770కి పెరిగింది. చిత్తూరు జిల్లాలో కోవిడ్ లక్షణాలతో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో చిత్తూరు, విశాఖ జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో చిత్తూరులో 1,124 మందికి కొత్తగా కోవిడ్ నిర్థారణవ్వగా, విశాఖపట్నంలో 1,028 కేసులు వెలుగు చూశాయి. గుంటూరులో 368, అనంతపురంలో 347, నెల్లూరులో 253, తూర్పు గోదావరిలో 233, విజయనగరంలో 209, కృష్ణాలో 207, శ్రీకాకుళంలో 187, ప్రకాశంలో 178, కడపలో 173, కర్నూలులో 168, పశ్చిమ గోదావరిలో 95 మందికి కొత్తగా కోవిడ్ పాజిటివ్ నిర్థారణైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21,06,280 మందికి కోవిడ్ సోకగా, వారిలో 20,65,000 మంది కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 14,510కి చేరింది.
పెరగని పరీక్షలు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా వ్యాధి నిర్థారణ పరీక్షలు మాత్రం పెరగడంలేదు. ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని అమలు చేస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణ భిన్నంగా ఉంది. రెండు వారాలుగా రాష్ట్రంలో టెస్ట్‌ల సంఖ్య సగటున 30 వేల నుంచి 32 వేలకు మించడంలేదు. ఈ నెల ఒకటో తేదీ వరకు 3.13 కోట్ల శ్యాంపిల్స్‌ను పరీక్షించగా, ఆదివారానికి టెస్ట్‌ల సంఖ్య 3.18 కోట్లకు పెరిగింది. సచివాయాలు, ఆరోగ్య కేంద్రాల వద్దకు వెళ్లినా, టెస్టింగ్ కిట్లు లేవంటూ బాధితులను తిప్పి పంపుతున్నారు. అవసరమైన కిట్లను ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించి, కనీసం రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.