Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యథేచ్ఛగా పందేలు, జూదం
- చేతులు మారిన రూ.600 కోట్లు
- అడ్డుకోలేకపోయిన ఏపీ పోలీసులు
విజయవాడ : ఏపీలో మూడో రోజు కూడా కోడి పందేలను పోలీసులు ఆపలేకపోయారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనుమ రోజు కూడా యథేచ్ఛగా కోడి పందాలు, జూద క్రీడలు కొనసాగాయి. తిరునాళ్లను తలపించేలా వీటి నిర్వహణ ఉన్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. కోడి పందేలకు కొందరి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అధికార పార్టీవారు ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి సహాయ, సహకారాలు ఉండడం, మమ్మూళ్లు అందడం ఇందుకు కారణమని జూదరులు బహిరంగంగానే చెప్తున్నారు. కోడిపందాల్లో ఆదివారం ఒక్కరోజే రూ.600 కోట్లపైనే బెట్టింగులు జరిగినట్లు సమాచారం. కోడి పందేల శిబిరాల వద్ద పేకాటతోపాటు గుండాట, క్యాసినో, లోపలా, బయటా వంటి జూదాలలో మరో వంద కోట్ల రూపాయల మేర పందేలు జరిగినట్లు అంచనా. ఈ ప్రాంతాల్లో మద్యం ఏరులైపారింది. ఎక్సైజ్ పోలీసులు కూడా పత్తా లేకుండా పోయారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురంలో గంటలో 12 పందేలు వేయగా, రెండు పందేలు ఒక్కొక్కటి రూ.7 లక్షలు సాగినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఒక ముఖ్య ప్రజాప్రతినిధి అండతో గుడివాడలో కోడి పందేలు, పేకాట, గుండాటతోపాటు క్యాసినో కూడా నిర్వహించారు. బెట్టింగ్ రాయుళ్ల కోసం ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి డ్యాన్స్ చేయించినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. విజయవాడలోని అజిత్సింగ్ నగర్, నున్న రూరల్, టూ టౌన్ పోలీసు స్టేషన్లకు అతి సమీపంలోనే కోడి పందేలు జరిగినా పట్టనట్లు వ్యవహరించారు. నగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే సహకారంతోనే పందేలు జరిగినట్లు సమాచారం. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో జరిగిన కోడి పందేలు, జూద క్రీడల్లో సరిహద్దు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కైకలూరు మండలం ఆలపాడులో పశ్చిమగోదావరి జిల్లా ఐ.భీమవరానికి చెందిన ఓ నిర్వహకుడు భారీ స్థాయిలో పందేలు, జూద క్రీడలు నిర్వహించాడు. రాష్ట్ర స్థాయిలో భీమవరం తర్వాత పెనమలూరు నియోజకవర్గం ఈడ్పుగల్లులో కోడిపందేలు, జూద క్రీడలు భారీ స్థాయిలో జరిగినట్లు, ఇక్కడ రూ.90 కోట్లకుపైగా చేతులు మారినట్లు సమాచారం. విజయవాడ సమీపంలోని ఈడ్పుగల్లు, తెలంగాణా సరిహద్దు ప్రాంతాలైన జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లోని లింగాల చిట్యాల, కైకలూరు మండలం ఆలపాడు ప్రాంతాల్లో రూ.50 కోట్లకుపైగా చేతులు మారాయి. మైలవరం నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో కోడి పందేలను ఫొటోలు తీసిన విలేకరులపై నిర్వాహకులు దాడికి ప్రయత్నించారు. దీనిపై జర్నలిస్టులు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలోని కోడి పందాలకు పోలవరం ఎమ్మెల్యే టి.బాలరాజు కోడిపుంజుతో హాజరయ్యారు. కాళ్ల మండలం సీసలిలో కోడి పందెంలో టిడిపి ఎమ్మెల్యే మంతెన రామరాజు పాల్గొన్నారు. కాళ్ల, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, మొగల్తూరు మండలంలోని పలు గ్రామాల్లోని పెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ఏలూరు, పెదవేగి మండలాల్లోని పలు గ్రామాల్లోనూ పందాలు యథేచ్ఛగా సాగాయి. ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో కోడి పందేల వద్ద అధికార పార్టీ నాయకుల హడావుడి ఎక్కువగా కనిపించింది. సీసలి, ఇరగవరంలలో ఫ్లడ్లైట్ల వెలుతురులో కోడి పందేలు నిర్వహించారు. పందేలను చూసేందుకు వీలుగా ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కుక్కునూరు మండల కేంద్రంతోపాటు, వేలేరులో పందేలకు తెలంగాణ నుంచి కూడా జనం వచ్చారు. గుంటూరు జిల్లాలోని వేమూరు, రేపల్లె నియోజకవర్గాలో కోడి పందేలు జోరుగా సాగాయి. పెనుమూడిలో జాతీయ రహదారి సమీపంలో పందేలు నిర్వహించినా స్థలాభావం, వాతావరణం దృష్ట్యా నిజాంపట్నానికి మార్చారు. ఈ బరుల వద్దకు వేల సంఖ్యలో జూదరులు వచ్చారు. చిన్నబరిలో రూ.5 వేల నుండి రూ.50 వేల వరకు, పెద్ద బరిలో రూ.50 వేల నుండి రూ.రెండు లక్షలకుపైగా పందేలు కాశారు. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండల పరిధిలో పల్లంకుర్రులో స్టేడియం తరహాలో ఏర్పాటు చేసిన బరిలో పగలే కాకుండా రాత్రి కూడా కోడి పందేలు జరిగాయి. జిల్లాలో గత మూడు రోజుల్లో రూ.250 కోట్ల వరకూ పందేలు జరిగినట్టు, మొత్తం బరుల్లో సుమారు 50 వేల వరకూ కోళ్లు చనిపోయినట్టు సమాచారం.