Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో : యూపీ బీజేపీలో రాజీనామాలు కొనసాగుతున్నాయి. సిట్టింగ్ ఎంఎల్‌ఎలందరూ కాషాయ బోటును వదిలి సోషలిస్టు శిబిరంలోకి చేరుతున్నారు. గురువారం నాటికి డజనుకు పైగా రాజీనామాలు చేశారు. వెనుకబడిన వర్గాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమే తమ ఈ రాజీనామాలకు కారణమని మెజారిటీ నేతలు పేర్కొంటున్నారు. కాగా పార్టీ నుంచి జరుగుతున్న ఫిరాయింపుల పట్ల బీజేపీ మౌనం పాటిస్తోంది. మరోపక్క డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ట్విట్టర్ ముఖంగా నిర్ణయాలను పున:పరిశీలించుకోవాల్సిందిగా మంత్రులను కోరారు. అయితే ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి చేయాల్సినంత కృషి జరగలేదని పార్టీలోని వారు పేర్కొంటున్నారు. తెరారు రీజియన్ నుంచీ మరికొన్ని రాజీనామాలు వస్తాయని వారు భావిస్తున్నారు. మనం అనుకునేది నిజమైతే, ఆ నేతలకు టిక్కెట్లు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదు. తమ తమ కీలకమైన ఓటు బ్యాంకులపై మంచి పట్టు వున్న చిన్న గ్రూపులు, సంస్థల మద్దతు అఖిలేశ్ యాదవ్‌కు వుందనేలా ఇటీవల ఒక ఫోటో బయటకు వచ్చింది. అప్నా దళ్ నేత, కేంద్ర క్యాబినెట్ మంత్రి అనుప్రియ పటేల్ తల్లి కృష్ణ పటేల్ మధ్యలో కూర్చునగా, అంకుల్ శిపపాల్ సింగ్ యాదవ్, ఓం ప్రకాష్ రాజ్‌భర్, ఇతరులు పక్కన కూర్చుని ఫోటోలో కనిపిస్తున్నారు. ఇది చూస్తుంటే అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడంలో, బీజేపీపై పోరు సల్పేందుకు వారినందరినీ ఒప్పించడంలో అఖిలేశ్ యాదవ్ విజయవంతమయ్యారని తెలుస్తోంది. అప్నా దళ్, నిషద్ పార్టీ తదితర చిన్న ప్రాంతీయ పార్టీల సాయంతోనే 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. వెనుకబడిన వర్గాలు లేదా యాదవేతర ఓబీసీల నేతలను ఆకట్టుకోవడానికే ఆ పోరాటం. కానీ ఇప్పుడు అఖిలేశ్ యాదవ్ బలంగా వున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ మద్దతు అంతా ఆ పార్టీకి ఓట్లుగా మారతాయి, రెండోసారి అఖిలేశ్ ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది.
బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.ఆర్.ఝా మాట్లాడుతూ, రాజకీయాల్లో సిద్ధాంతాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలే మిన్నగా వున్నాయని ఈ రాజీనామాల ధోరణిని బట్టి స్పష్టమవుతోందని అన్నారు.
''రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడానికి, కానీ ఇటీవల కాలంలో, రాజకీయనేతలు అవకాశవాదులుగా మారుతున్నారు. స్వాతంత్య్ర అనంతర ఎన్నికల్లో కూడా అంటే 1957, 62, 67 ఎన్నికల్లో ఇలాంటి ఫిరాయింపులు లేవు. ఏదైనా వ్యక్తిగత కారణముంటే తప్ప ఎన్నికలకు ముందు ఇలా పార్టీలు మారడం లేదా రాజీనామాలు చేయడం ఎన్నడూ చూడలేదు. రాజకీయ నేతలకు సిద్ధాంతం వుండడం అవశ్యం.'' అని పేర్కొన్నారు. 1967 తర్వాత నుండి ప్రజలకు సేవ చేసే కాంక్ష తగ్గిపోయిందన్నారు.
బీజేపీ ఈసారి టిక్కెట్ ఇవ్వకపోవచ్చని సూచనప్రాయంగానైనా తెలిసి వుండడం, కుల కారణాలు, (ఈ ప్రభుత్వంలో యాదవేతర ఓబీసీ నాయకత్వానికి కొంత అసౌకర్యంగా వున్నందున) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యవహార శైలి ఈ మూడు ఇటీవలి ఫిరాయింపులకు కారణాలని ప్రముఖ జర్నలిస్టు రతన్మణి లాల్ అని పేర్కొన్నారు.
అయితే ఇప్పుడే ఏం చెప్పినా అది తొందరపాటే అవుతుందని అన్నారు. బీజేపీ చాలా పెద్ద పార్టీ అయినందున ఈ ఫిరాయింపులు దానికి పెద్దగా ప్రభావం చూపుతాయని భావించడం లేదని అన్నారు. ఈ నేతల స్థానంలో వేరొకరిని తీసుకువచ్చేందుకు ప్రత్యామ్నాయాలు వున్నాయన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో బీజేపీ స్తంభించిపోదని, తనను తాను సంబాళించుకుని కార్య రంగంలోకి దూకగలదని అన్నారు.