Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హిందూత్వ నాయకుడు, గత నెలలో హరిద్వార్‌లో ధర్మ సంసద్ నిర్వహకుడు యతి నర్సింగ్ఆనంద్ను అరెస్టు చేసింది విద్వేష ప్రసంగం కేసులో కాదని పోలీసులు తెలిపారు. మహిళలపై అభ్యంతర కర వ్యాఖ్యలు చేసినందుకు అని చెప్పారు. అయితే మత విద్వేష ప్రసంగం కేసులో అతనికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఈ కేసులోనూ అతన్ని రిమాండ్‌కి తరలిస్తామని తెలిపారు. 'యతి నర్సింగ్ఆనంద్ను ప్రస్తుతానికి హరిద్వార్ ద్వేషపూరిత ప్రసంగం కేసులో అరెస్టు చేయలేదు, మహిళలపై కించపరిచే వ్యాఖ్యలకు అరెస్టు చేశాం. ఆ కేసులో ఇప్పటికే అతనికి నోటీసులు జారీ చేయబడ్డాయి. విద్వేషపూరిత ప్రసంగం కేసుకు కూడా అతన్ని రిమాండ్ చేస్తాం. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. మేము విద్వేషపూరిత ప్రసంగం కేసు వివరాలను కూడా రిమాండ్ దరఖాస్తులో పొందుపరుస్తాం' అని పోలీసు అధికారులు చెప్పారు. సమాచారం ప్రకారం, నర్సింగ్ఆనంద్పై ప్రస్తుత కేసు స్త్రీ ద్వేషానికి సంబంధించినది. ఇతర మతాలకు చెందిన మహిళలపై అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేసినటు ఈ నెల ప్రారంభంలో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదయింది. ఎఫ్ఐఆర్లో మహిళలను కించపరిచే ఆరోపణలతో పాటు విద్వేషపూరిత ప్రసంగ ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇవి హరిద్వార్‌లో ధర్మ సంసద్ విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించినవి కావు. హరిద్వార్‌లో ధర్మ సంసద్ విద్వేస ప్రసంగం కేసులో కొంత మంది పాటు యతి నర్సింగ్ఆనంద్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదయైన సంగతి తెలిసిందే. విద్వేష ప్రసంగం కేసులో ఇప్పటి వరకూ ఒక్క అరెస్టు మాత్రమే జరిగింది. జితేంద్ర నారాయణ్ త్యాగిని అరెస్టు చేశారు. ధర్మ సంసద్ కార్యక్రమం జరిగిన నెల రోజు తరువాత, అది కూడా సుప్రీంకోర్టు జోక్యంతో త్యాగిని అరెస్టు చేశారు. ధర్మ సంసద్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతోపాటు వారిపై మారణ హోమానికి పిలుపునిచ్చారు. కాగా, మరోవైపు ధర్మ సంసద్ కార్యక్రమంలో విద్వేష ప్రసంగాలు చేసిన వారు తాము ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నారు. పోలీసులకు భయపడమని అంటున్నారు.