Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది చైనాతో భారత వాణిజ్యం
- దిగుమతులు దాదాపు 100 బిలియన్ డాలర్లు
- చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ సమాచారం
న్యూఢిల్లీ, హాంకాంగ్ : గతేడాది చైనాతో భారత వాణిజ్యం 125 బిలియన్ డాలర్లను ( రూ. 9.29 లక్షల కోట్లకు పైగా) దాటింది. ఇందులో చైనా నుంచి దిగుమతుల విలువే దాదాపు 100 బిలియన్ డాలర్లుగా ( రూ. 7.43 లక్షల కోట్లకు పైగా) ఉన్నది. ఈ సమాచారాన్ని చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ (జీఏసీ) ఈనెల 14న విడుదల చేసింది. చైనా వస్తువుల శ్రేణి, ముఖ్యంగా మెషినరీకి నిరంతర డిమాండ్‌ను ఇది నొక్కి చెప్పింది.
2019లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మించి..
ఈ సమాచారం ప్రకారం.. గత 12 నెలల్లో చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 2019లోని ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మించిపోయింది. 2019లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 92.8 బిలియన్ డాలర్లుగా ( రూ. 6.90 లక్షల కోట్లకు పైగా) ఉన్నది. అయితే, 2020లో కరోనా మహమ్మారి కారణంగా అది 87.6 బిలియన్ డాలర్లకు (రూ. 6.51 లక్షలకు పైగా) పడిపోయింది. 2019 నుంచి దిగుమతులు 30 శాతం ఎగబాకాయి.
చైనాకు రూ. 2.09 లక్షల కోట్ల ఎగుమతులు
అలాగే, చైనాకు భారత ఎగుమతుల విలువ 28.1 బిలియన్ డాలర్లుగా (రూ. 2.09 లక్షల కోట్లకు పైగా) ఉన్నది. గత రెండేండ్లలో దీనిలో పెరుగుదల 56 శాతంగా నమోదుకావడం గమనార్హం. గతేడాది వాణిజ్య లోటు 69.4 బిలియన్ డాలర్లకు ( రూ. 5.16 లక్షల కోట్లకు పైగా) చేరుకున్నది. అయితే, కరోనా మహమ్మారికి ముందు 2019లో నమోదైన వాణిజ్య లోటుతో పోలిస్తే 22 శాతం పైకి ఎగబాకటం గమనార్హం.
భారత్ నుంచి చైనాకు జరిగిన అతిపెద్ద ఎగుమతులు ఇనుప ఖనిజం, పత్తి, ఇతర ముడి పదార్ధాల ఆధారిత వస్తువులు ఉన్నాయి. అయితే గతేడాది చైనాలో ఈ డిమాండ్ పుంజుకున్నది. ఇక చైనా నుంచి భారత్ ఎలక్ట్రికల్, మెకానికల్ మెషినరీ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), ఆటో భాగాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల నుంచి పీపీఈల వరకు అనేక రకాల వైద్య సరఫరాలను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకున్నది.
భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యంలో ఏడాదికి 43 శాతం వృద్ధి.. చైనా ప్రధాన వాణిజ్య భాగస్వాములలో అత్యధికంగా ఉన్నది. చైనా మూడు అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వాములతో వాణిజ్య గణాంకాలు ఏసియాన్‌తో 28.1 శాతం (878.2 బిలియన్ డాలర్లకు అంటే రూ. 65.32 లక్షల కోట్లకు పైగా), యూరోపియన్ యూనియన్‌తో 27.5 శాతం (828.1 బిలియన్ డాలర్లకు, అంటే రూ. 61.59 లక్షల కోట్లకు పైగా), యునైటెడ్ స్టేట్స్తో 28.7 శాతం (755.6 బిలియన్ డాలర్లకు అంటే రూ. 56.20 లక్షల కోట్లకు పైగా) వృద్ధిని చూపించాయి.
2021లో చైనా వైద్య ఎగుమతులు రెండింతలు పెరిగాయని జీఏసీ ప్రతినిధి లి కుయివెన్ అన్నారు. అయితే, ల్యాప్‌టాప్‌లు, గృహౌపకరణాలు 13 శాతం పెరిగాయని చెప్పారు. 2021లో చైనా బలమైన వాణిజ్య తీరు, రికవరీ ఉన్నప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు హెచ్చరించారు.