Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన నిరుద్యోగం.. తగ్గిందంటూ ప్రచారం
- ఎన్నికల రాష్ట్రాల్లో బీజేపీ జిమ్మిక్కు
- ప్రయోజనం చేకూరని పథకాలెన్నో..
- గణాంకాలతో గట్టెక్కే యత్నం
ఓవైపు కరోనా థర్డ్‌వేవ్ రూపంలో ఒమిక్రాన్..ఇంకోవైపు ఎన్నికలు.. అయితే అక్కడి ప్రభుత్వాలు ఉపాధిరంగంలో విఫలమవుతున్నాయా..! ఎందుకని వీటిపై దృష్టిపెట్టడంలేదు..? టీవీ ఆన్ చేస్తే చాలు.. నేతల ఇంటర్వ్యూలు, ముఖ్యంగా బీజేపీ నేతల హడావుడే ఎక్కువగా కనిపిస్తున్నది. ఎందుకంటే గోడీ మీడియా కమలం పార్టీ కబంధహస్తాల్లో ఉండటం వల్ల ఎటుచూసినా తిమ్మిని బమ్మిని చేసి హైలెట్ కావాలన్న ప్రచారమే అధికం. వాస్తవానికి అక్కడి ప్రభుత్వాల్లో ఉద్యోగాల పరిస్థితేంటి..అని అడిగే నాథుడే కనిపించటంలేదు. ఇంతకీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ.. 2021 డేటా విశ్లేషణలో ఏమున్నది..?
న్యూఢిల్లీ : ఎన్నికలకు వెళ్లే రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి రంగంలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కానీ అందుకు భిన్నంగా ఉపాధి వెతుక్కునే వారి సంఖ్య తగ్గిందనే నివేదికలు సంభ్రమాశ్చరానికి గురిచేస్తున్నాయి.
నిరుద్యోగం
ప్రభుత్వం నిరుద్యోగం విషయంలో సక్రమంగా వ్యవహరిం చిందా లేదా? ఐదేండ్లలో ఉపాధి వెతుక్కుంటూ బయటకు వచ్చిన వారికి ఉపాధి లభించిందా లేదా.. అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే.. బీజేపీపాలిత రాష్ట్రాల్లో భూతద్దంలో వెతికినా సరైన సమాధానం రావటంలేదు. పైగా నిరుద్యోగ సమస్య అనేది దరిదాపుల్లో లేదని మీడియాలో అక్కడి బీజేపీ నేతలు చెప్పుకుంటూ చంకలు గుద్దుకుం టున్నారు. గత ఐదేండ్లలో జనాభా తప్పనిసరిగా పెరిగి ఉంటుంది. మనందరికీ తెలిసిన సాధారణ విషయం జనాభా పెరిగితే.. దానికను గుణంగా.. పని వెతుక్కుంటూ బయటకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరగాలి. ఈ సంఖ్య పెరిగితే. ప్రజలకు ఉపాధి లభించి ఉంటే ప్రభుత్వ పనితీరు ఇంచుమించు బాగానే ఉన్నదని భావించవచ్చు. కానీ ఉపాధి కోసం జనం వెనుదిరుగుతుంటే.. బతుకుదెరువుకు పని దొరికే విధంగా ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఉన్నాయి. కానీ ఇది జరగడం లేదు. నివేదికలు కూడా ప్రభుత్వాలు సూచినట్టుగా ఉండటమే కాదు. వాస్తవ ఉపాధికి విరుద్ధంగా ఉంటున్నాయని నిరుద్యోగ యువకుల వాదన
యూపీలో వాస్తవికత ఏమిటంటే..!
ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నదో ఒక్కసారి పరిశీలిద్దాం. గత ఐదేండ్లలో...యూపీలో శ్రామిక జనాభా అంటే.. 15 ఏండ్లకు పైబడిన జనాభా సుమారు రెండుకోట్ల వరకూ పెరిగింది. ఈ జనాభా 14.95 కోట్ల నుంచి 17.07 కోట్లకు చేరింది. ఇంతగా జనాభాలో పెరుగుదల కనిపిస్తే.. ఉపాధిలోనూ పెరుగుదలకు దారితీయాలి. కానీ ఉపాధి అవకాశాలు మాత్రం పెరగలేదు. పైగా ఉపాధి సంఖ్య సుమారు 16 లక్షలు తగ్గింది. 2016లో ఉత్తరప్రదేశ్‌లో 15 ఏండ్లకు పైబడిన 38.5 శాతం మందికి ఉపాధి ఉన్నది. 2021 డిసెంబర్లో ఈ సంఖ్య 32.8 శాతానికి తగ్గింది. యూపీలో 2016 సంవత్సరం ప్రకారం 2021 లోనూ అదే ఉపాధి రేటు ఉంటే, కనీసం కోటి మందికి ఉపాధి లభించి ఉండేది. దీన్ని నొక్కి చెప్పటంలే యోగి సర్కార్ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గోవాలోనూ..
నిరుద్యోగం విషయంలో గోవాలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఐదేండ్ల కిందట గోవాలో ఉపాధి పొందగల జనాభాలో ప్రతి ఒక్కరికిు ఉపాధి ఉండేది. అంటే,..ఐదేండ్ల కిందట గోవా ఉపాధి రేటు దాదాపు 50 శాతం. ఐదేండ్ల తర్వాత అది 32 శాతానికి తగ్గింది. అంటే, గోవాలోని శ్రామిక జనాభాలో ముగ్గురుంటే..వారిలో ఒకరికి ఉపాధి ఉన్నది.
ఉత్తరాఖండ్
ఇక దేవ్స్థాన్గా పిలుచుకునే ఉత్తరాఖండ్‌కు కూడా నిరుద్యోగం నుంచి ఉపశమనం లభించలేదు. గత ఐదేండ్ల లో 15 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య 14 శాతం పెరిగింది. ఈ సంఖ్య 91 లక్షలకు చేరుకున్నది. కానీ ఉద్యోగాల సంఖ్య దాదాపు నాలుగున్నర లక్షల మేర తగ్గింది. ఉత్తరాఖండ్‌లో ఉపాధి రేటు 2016లో దాదాపు 40 శాతంగా ఉండేది. 2021లో అది 30 శాతానికి తగ్గింది.
పంజాబ్ పరిస్థితి
పంజాబ్‌లోనూ ఇదే పరిస్థితి. ఐదేండ్ల కిందట పంజాబ్‌లో పని చేసే జనాభా అంటే 15 ఏండ్లకు పైబడిన జనాభా 2.33 కోట్లు. ఇప్పుడు దాదాపు 2.58 కోట్లకు చేరింది. ఐదేండ్ల కిందట పంజాబ్‌లో 98.37 లక్షల మందికి ఉపాధి లభించింది. ఐదేండ్లు గడుస్తున్నా ఇంకా పెరగలేదు. దాదాపు 3.21 లక్షల మందికి తగ్గుదల ఉపాధి పొందుతున్న వారి సంఖ్య నమోదవుతోంది. ఇప్పుడు పంజాబ్‌లో దాదాపు 95.16 లక్షల మందికి ఉపాధి ఉన్నట్టు రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి.
లేబర్‌ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే..
లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది శ్రామిక జనాభా అంటే 15 ండ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న జనాభా, వారు ఏదో ఒక ఉపాధిలో నిమగమై ఉన్నారు. లేదా ఉపాధి కోసం చూస్తున్నారు. ఈ రెండింటిని జోడిస్తే.. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు ఎంత అనేది తెలుస్తోంది. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు ఆధారంగా నిరుద్యోగిత రేటు బహిర్గతమవుతోంది. ఎందుకంటే చాలా మంది పని చేసే వ్యక్తులు ఉపాధి కోసం వెతకడం మానేశారు. దీనివల్ల కార్మిక శక్తి భాగస్వామ్య రేటు తగ్గుతోంది. దాంతో నిరుద్యోగిత రేటు, వాస్తవ నిరుద్యోగం గురించి వివరాల విషయంలో కచ్చితమైన అంచనా ఇవ్వదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డైరెక్టర్ మహేశ్ వ్యాస్ కూడా అదే మాట అంటున్నారు,
కార్మికశక్తి భాగస్వామ్యం తక్కువే..
ఇతరదేశాల్లో కార్మిక శక్తి భాగస్వామ్యరేటు దాదాపు దాదాపు 60 నుంచి-70 శాతం. కానీ భారత్‌లో మాత్రం 40 శాతమే. ప్రపంచంలోని ఇతర దేశాలలో మొత్తం శ్రామిక జనాభాలో ఎక్కువ మంది ఉపాధిని కలిగి ఉన్నారు.కానీ భారతదేశంలో ఈ సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. ఐదేండ్ల కిందట దేశ జనాభా 96 కోట్లు కాగా..ఐదేండ్ల తర్వాత 108 కోట్లకు చేరింది. ఈలెక్కన పెరిగిన జనాభా ప్రకారం 41 కోట్ల మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. ఇపుడు ఆ సంఖ్య తగ్గి 40 కోట్లకు చేరింది. భారత్‌లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఐదేండ్ల ముందు 46 శాతం ఉంటే..ఇపుడు అది 40 శాతానికి దిగజారింది. ఇక ఐదేండ్ల ముందు 43 శాతానికి దరిదాపుల్లో ఉపాధి ఉంటే..ఇపుడు 37 శాతానికి చేరింది.రెండు కోట్ల మందికి ఏటా ఉద్యోగాలిస్తామంటూ..అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ ఆ సంగతే మర్చిపోయారు. కరోనా వల్లే ఉపాధి దెబ్బతిన్నదంటూ..సాకుగా చూపుతున్నాయి. అందులో భాగంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగ గణాంకాలను తగ్గించి..అబద్ధాలతో గట్టెక్కటానికి అక్కడి పాలకులు ప్రయత్నిస్తున్నారు.