Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరాది రాష్ట్రాల్లో పడిపోయిన పగటి ఉష్ణోగ్రతలు
- ఢిల్లీ, పంజాబ్, హర్యానా..రాష్ట్రాల్లో మంచు దుప్పటి
న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో చలి జనాల్ని అల్లాడిస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో పగటి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. మరో వారం రోజులు చలి తీవ్రత ఇలాగే ఉంటుందని భారత వాతావరణ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సీయెస్కన్నా దిగువకు పడిపోతే చలి వాతావరణం ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటిది అనేక రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీల నుంచి 6.4 డిగ్రీల సెల్సీయస్ మధ్య నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా వాయువ్య భారతంలో అల్ప పీడనం అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడానికి దారితీసిందని, చలి తీవ్రత మరికొద్ది రోజులు ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజరు మోహపాత్ర చెప్పారు. వాయువ్య భారతంలో ఏర్పడ్డ ప్రత్యేక వాతావరణం హిమాల యాల నుంచి వెలువడే చల్లటి గాలుల్ని ఉత్తరాది రాష్ట్రాల వైపునకు తీసుకెళ్తోందని, దాంతో ఉష్ణోగ్రత లు మరింతగా పడిపోవటానికి కారణమైందన్నారు. ఉత్తరాదిలో అనేక రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. గత మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణంగా కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జమ్మూ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో మంచు కురవటం మరింత పెరిగింది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉదయం వేళల్లో మంచు కారణంగా రోడ్డుమీద రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. వాయువ్య భారత్‌లో మరో అల్పపీడన ద్రోణిని వాతావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికారణంగా జనవరి 21-23 మధ్య హిమాలయా ల్లో మంచు వర్షం కురిసే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. మహారాష్ట్రలో తీవ్రమైన చలి మరోవారం పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్ ప్రాంతంలో మినహా సాధారణ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల నుంచి 7 డిగ్రీల సెల్సీయస్ వరకు పడిపోతాయని తెలిపింది. మహారాష్ట్ర అంతటా జనవరి 20 వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్త అనుపం కశ్యప్ తెలిపారు. మరికొద్ది రోజులు చలి తీవ్రస్థాయిలో ఉంటుందని, ఆకాశం మేఘావృతం అవుతుందని అన్నారు.