Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూడిల్లీ : ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్ -యుసిసి) పై దాఖలై ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో వున్న పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంలో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. బహుళ వ్యాజ్యాలను నివారించడానికి, తుది తీర్పును నిర్ధారించడానికి వీటిని బదిలీ చేయాలని ఆ పిటిషన్లలో కోరారు. ఈ మేరకు అంబర్ జైది, నిగత్ అబ్బాస్, డానిష్ ఇక్బాల్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. 2020 మార్చి 20న యుసిసిపై దాఖలైన పిల్స్‌పై వివిధ మంత్రిత్వ శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని, అయినా ఇంతవరకు ఎలాంటి విచారణ జరగలేదని వారు ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. కీలకమైన రాజ్యాంగ అంశాలు ఈ పిటిషన్లలో ఇమిడి వున్నందున వీటిని సుప్రీం కోర్టుకు బదిలీ చేస్తే బాగుంటుందని వారు పేర్కొన్నారు. అంతకుముందు లాయర్, బిజెపి నేత అశ్విని ఉపాధ్యారు కూడా ఇటువంటి బదిలీ పిటిషన్ దాఖలుచేశారు. వివాహ కనీస వయసు, విడాకుల కారణాలు, భరణం, దత్తత-సంరక్షణ బాధ్యతలు, వారసత్వం అంశాలపై ఏకీకృత చట్టాలను తీసుకురావాలని కోరుతూ విడివిడిగా ఐదు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలుచేశానని, అవన్నీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో వున్నాయని ఉపాధ్యారు తెలిపారు.