Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కార్పొరేటీకరణే ధ్యేయంగా రక్షణ శాఖ కింద పనిచేస్తున్న 41 ఆర్డినెస్స్ ఫ్యాక్టరీలను మోడీ సర్కార్ 7 కార్పొరేషన్లుగా విడగొట్టింది. అయితే ఈ నిర్ణయాన్ని అమలుచేస్తున్న సమయంలో ఉద్యోగుల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నది. ఆర్డినెస్స్ ఫ్యాక్టరీలకు అనుబంధంగా ఉన్న 29 ఆస్పత్రులు, డిస్పెన్సరీలను ఈ కార్పొరేషన్లలో భాగం చేయలేదు. ఈ ఆస్పత్రుల ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య సేవలను పొందుతుంటారు. గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు.. ఇప్పుడు కొత్తగా సృష్టించిన డైరెక్టరేట్ ఆఫ్ ఆర్డినెస్స్ (సీ అండ్ ఎస్) నియంత్రణలో ఉంటాయి. దీని బట్టి చూస్తే ప్రభుత్వం వీటిని వదిలించుకోవాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నెల 10న డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీ డా. అజరు కుమార్ రాసిన లేఖలో ఈ విషయం స్పష్టమవుతున్నది. ఈ ఆస్పత్రుల సేవలు.... కొత్త కార్పొరేట్ సంస్థలు చేపట్టవనీ, వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేయవచ్చుననీ.. ఆర్డినెస్స్ ఫ్యాక్టరీల ఆస్పత్రులున్న 10 రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఆయన ఓ లేఖ రాశారు. ఈ ఏడు కార్పొరేషన్లు వాణిజ్య ప్రాతిపదికన నడుస్తాయనీ, కోర్ ప్రొడక్షన్ కార్యాకలాపాలపై మాత్రమే దృష్టి పెడతాయని ఆయన పేర్కొన్నారు.కాగా, కార్పొరేటీకరణ ధ్యేయంగా ఆర్డినెస్స్ ఫ్యాక్టరీలను ముక్కలుగా విడగొట్టడంపై భగ్గుమంటున్న ఉద్యోగులు.. ఇప్పుడు ఆస్పత్రుల సేవలను నిలిపివేస్తూ లేఖ రాయడం పట్ల ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏఐడీఈఎఫ్) ప్రధాన కార్యదర్శి సి. శ్రీకుమార్ తీవ్రంగా స్పందించారు. వాణిజ్య ప్రాతిపదికన వీటిని నడపాలన్న డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీ డా. అజరు కుమార్ లేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఆస్పత్రుల సేవలు నిలిపివేయాలనుకోవడం.. అసమర్థ చర్యగా ఆయన అభివర్ణించారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నీ... తమ ఆస్పత్రులను సమర్థవంతంగా నడుపుతున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. కోవిడ్ సమయంలో ఆస్పత్రుల ప్రాముఖ్యత గురించి ప్రభుత్వానికి తెలిసిందనీ, వాస్తవంగా చెప్పాలంటే కోవిడ్ సంక్షోభ సయయంలో ప్రభుత్వ, రైల్వే, ఆర్డినెస్స్ ఫ్యాక్టరీ ఆస్పత్రులు.. ఎనలేని సేవలు అందించాయని అన్నారు. లక్షలు కట్టలేక సామాన్యులు ఈ ఆస్పత్రులపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు.వీటిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీజీహెచ్ఎస్, కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈఎస్ఐసీ ఆస్పత్రులు స్వాధీనం చేసుకునేందుకు నిరాకరించడంతోనే.. ఆ పని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారని శ్రీకుమార్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం క్యాబినెట్ నిర్ణయంతో పాటు మద్రాస్ హైకోర్టుకిచ్చిన హామీలను ఉల్లఘించడం కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలోనే కాకుండా, ఫ్యాక్టరీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ఉద్యోగులకు ఆర్డినెస్స్ ఫ్యాక్టరీస్ మెడికల్ రెగ్యులేషన్ (ఓఎఫ్ఎంఆర్) వైద్య సేవలను అందుతాయని పేర్కొన్నారు. అటువంటిది ఈ వైద్య హక్కులను ప్రభుత్వం ఎలా తొలగిస్తుందని ప్రశ్నించారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, సాయుధ వాహనాల తయారీలో నిమగమైన సమయంలో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటాయని అన్నారు. ఈ ఆస్పత్రులన్నీ మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయనీ, అందువల్ల ఆస్పత్రులను నిర్వీర్యం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇటువంటి చర్యలను ప్రజలు సమర్థించరని అన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్పొరేటీకరణ తర్వాత ఉద్యోగులకు కష్టాలు, వేధింపులు మొదలయ్యాయనీ, ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఉద్యోగులు అభద్రతా భావంతో పనిచేస్తున్నారని అన్నారు. దీనిపై రక్షణ శాఖ మంత్రిని త్వరలో కలుస్తామని తెలిపారు,