Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ప్రధానికి ఐఐటీల మాజీ విద్యార్థుల లేఖ
- పెరుగుతున్న నిరుద్యోగం, ఓ మతానికి వ్యతిరేకంగా మారణహోమంపై ప్రస్తావన
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఒక మతానికి వ్యతిరేకంగా మారణహోమం వంటి విద్వేష వ్యాఖ్యలు గురించి ప్రధాని మోడీకి దేశంలో వివిధ ఐఐటీల మాజీ విద్యార్థులు లేఖ రాసారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కూడా ఆ లేఖను జతచేశారు. 'దేశాన్ని కమ్ముకుంటున్న చీకటీ మేఘాల' గురించి లేఖలో ప్రస్తావించారు. దేశంలో ఓవైపు నిరుద్యోగం, పేదరికంలోకి ప్రజలు నెట్టివేయబడుతుంటే.. మరోవైపు ఒక మతస్థులపై మారణహోమం పిలుపులతో తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు.
దేశంలో ముస్లిం వ్యతిరేక భావం ఎంతగా ఉన్నా, దేశరాజధాని న్యూఢిల్లీకి 150 మైళ్ల దూరంలోని హరిద్వార్‌లో జరిగిన మూడు రోజుల సదస్సులో ముస్లింలపై మారణహోమం జరపాలని పిలుపు ఇవ్వడం ఇటీవల కాలంలో పెరుగుతున్న తీవ్రమైన హింసకు గుర్తుగా ఉందని లేఖలో తెలిపారు.
'ఈ చర్యను ఖండించాలి. నేరస్థులపై వేగవంతమైన, అర్ధవంతమైన చట్టపరమైన చర్యను ప్రారంభించాలి' అని మోడీ, ఇతర నాయకులను ఐఐటీ మాజీ విద్యార్థులు కోరారు. అలాగే బుల్లీ బారు, ఇతర అభ్యంతరకర యాప్‌ను రూపొందించడం సిగ్గుచేటని లేఖలో తెలిపారు. ఈ కేసుల్లో అనుమానితులుగా పట్టుబడిన యువకుల వయస్సు, మన సమాజంలో మతపరమైన విద్వేషం, స్త్రీద్వేషం ఎంత తీవ్రమైనదో సూచిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ సంఘటనలను కూడా, మీరు, మీ ప్రభుత్వం సాధ్యమైనంత తీవ్ర స్వరంతో ఖండించడం కోసం, రాజ్యాంగంపై దేశ విశ్వాసాన్ని పునరుద్ఘాటించడం కోసం తాము ఎదురుచూస్తున్నట్టు విద్యార్థులు తెలిపారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతికి సాయుధ దళాల మాజీ చీఫ్‌లు రాసిన లేఖ గురించి కూడా విద్యార్థులు ప్రస్తావించారు.
అలాగే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) విద్యార్థులు, అధ్యాపకులు ప్రధానికి రాసిన మరో లేఖలో 'గౌరవనీయులైన ప్రధానమంత్రి, మన దేశంలో పెరుగుతున్న అసహనంపై మీ మౌనం, మన దేశంలోని బహుళసాంస్కతిక ఫాబ్రిక్లో భాగమైన మనందరికీ నిరుత్సాహపరుస్తుంది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి, మీ మౌనం ద్వేషంతో నిండిన స్వరాలకు ధైర్యాన్నిస్తుంది. మన దేశ ఐక్యత సమగ్రతకు ముప్పు కలిగిస్తుంది' అని తెలిపారు.
నేషనల్ యూత్ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని చేసిన ప్రసంగాన్ని విద్యార్థులు గుర్తు చేశారు. 'న్యూ ఇండియా మంత్రం... పోటీపడండి, గెలవండి, పాల్గొనండి, గెలవండి. ఐక్యంగా ఉండి యుద్ధంలో విజయం సాధించండి'. 'ఇది సాకారం కావాలంటే ''రాజ్యాంగాన్ని సమర్థించాలి'' అని మోడీ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేస్తూ 'భారతదేశాన్ని విభజించే ఈ భయంకరమైన పోకడలపై మీ నిర్ణయాత్మక చర్య కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని లేఖలో విద్యార్ధులు తెలిపారు. 1962 నుంచి 2023 వరకూ దేశంలోని వివిధ బ్యాచ్‌లకు చెందిన అనేక మంది ఐఐటియన్లు ఈ లేఖపై సంతకం చేశారు.