Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ : దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోవిడ్ పరీక్షల నిర్వహణ తగ్గడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. నిర్దిష్ట ప్రాంతాల్లో పాజిటివిటీ కేసుల ట్రెండ్ కొనసాగుతున్న దృష్ట్యా వ్యూహాత్మక విధానాలను అనుసరించాలని, తక్షణం కోవిడ్ పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. వైరస్ వ్యాప్తి జాడను సమర్ధవంతంగా తెలుసుకునీ, వ్యాధి విస్తరించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ పరీక్షలను పెంచాలని ఆ ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. వైరస్ వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యల్లో భాగంగా కొత్త క్లస్టర్లు, హాట్స్పాట్లు గుర్తించాలని, కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. జనవరి 10న ఐసీఎంఆర్ జారీ చేసిన టెస్టింగ్ స్ట్రాటజీని అనుసరించాలని పేర్కొంది. ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నట్టు గణాంకాలు చెబుతుండగా, కోవిడ్ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల నమోదు తగ్గుతున్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ తాజా ఆదేశాలు జారీ చేసింది.