Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించానని, కరోనా నిర్ధారణ అయిందని ట్విట్టర్లో మంగళవారం ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్లో ఉన్నానని, తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఉండవల్లిలోని నివాసగృహంలో చంద్రబాబు ఐసోలేషన్లో ఉన్నారు. ఆయన కుమారుడు, మాజీ మంత్రి లోకేష్కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. మరో మాజీ మంత్రి దేవినేని ఉమాకు కూడా మంగళవారం కరోనా నిర్ధారణైంది.
త్వరగా కోలుకోవాలి : ఏపీ గవర్నరు, సీఎం
కోవిడ్ పాజిటివ్ నిర్థారణైన ప్రతిపక్ష నేత చంద్రబాబు త్వరగా కోలుకోవాలని రాష్ట్ర గవర్నరు విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్లో వారు ట్వీట్ చేశారు. చంద్రబాబు కోలుకోవాలని జనసేన అధినేత పవన్కళ్యాణ్ కూడా ఆకాంక్షించారు.