Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలకు ముందు బీజేపీ డ్రామా
- నాడు నేతాజీ ఇపుడు వీర్ బాలక్ దివస్
- మోడీ ప్రభుత్వం ఎన్నిసార్లు తలదించింది..?
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందునుంచే బీజేపీ డ్రామాలకు తెరలేపడం ఆనవాయితీగా మారింది. వంగి..వంగి దండాలు పెడుతోంది. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో నేతాజీ సుభాశ్ చంద్రబోస్‌తో రాజకీయం చేయాలనుకుంటే..ఇపుడు వీర్ బాలక్ దివస్ ..ఇలా అవసరాన్ని బట్టి ఓట్ల రాజకీయం చేయటానికి మోడీ బృందం సన్నద్ధమైంది. అయితే మోడీ సర్కార్ జనం ముందు ఎన్నిసార్లు తలదించింది..?
న్యూఢిల్లీ : జనం మధ్య చిచ్చుపెట్టి..అధికారంలోకి రావటమే పరమావధిగా బీజేపీ తీరు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పథకాలకు పేరుమార్చి రాజకీయం చేస్తూ..ఆ పథకాలను ఏవిధంగా నీరు గారుస్తున్నదో దేశప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటీవల డిసెంబర్ 26 నుంచి వీర్ బాలక్ దివస్ జరుపుకోనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. గురు గోవింద్ సింగ్, వారి నలుగురు అనుచరుల ( సాహిబ్జాదాల) బలిదానానికి గౌరవార్థం వీర్ బాలక్ దివస్ ప్రకటించింది. ధర్మ మార్గంలో నలుగురు సాహిబ్జాదేలు ప్రాణాలు కోల్పోయారు. అందువల్ల వారి బలిదానాన్ని గౌరవించాలి. అయితే పంజాబ్ ఎన్నికలలో బీజేపీ గట్టెక్కటానికి నలుగురు సాహిబ్‌జాదాలను మొఘలులు దారుణంగా హత్య చేశారంటూ..ఇప్పుడు రాజకీయ తెరపైకి తెచ్చింది. దీంతో మిగిలిన రాష్ట్రాల్లో ముస్లిం వ్యతిరేకతను పెంచడం కోసమే ప్రధాని మోడీ ఈ ప్రకటన వెనుక ముఖ్య ఉద్దేశంగా స్పష్టమవుతోంది.
ఈ ప్రకటనలో మరో హిడెన్ ఎజెండా కూడా కనిపిస్తోంది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి (నవంబర్ 14) నాడు బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం డిసెంబర్ 26న వీర్ బాలక్ దివస్ నిర్వహిస్తే బాలల దినోత్సవానికి ప్రాధాన్యత తగ్గలేదా? ఈ ప్రభుత్వం ఇప్పటికే అలాంటి పని చేస్తోంది. ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇప్పుడు ఎలాంటి కార్యక్రమం లేదు. ఆ రోజున మాత్రమే సర్దార్ వల్లభారు పటేల్ జయంతిని జరుపుకుంటారు . అక్టోబర్ 2 గాంధీ జయంతి కంటే ఎక్కువగా జాతీయ పరిశుభ్రత దినోత్సవ(స్వచ్ఛ్భారత్) కార్యక్రమాలు ఉన్నాయి. సాహిబ్జాదాలు త్యాగం చేసింది మత రక్షణ కోసం కాదు, మతస్వేచ్ఛ రక్షణ కోసమేనన్నది నిర్వివాదాంశం. ఇప్పటికీ భారత్‌లో అలాగే ఉన్నది.ఎవరైనా మత స్వేచ్ఛను లాక్కోవడం తప్పు.. నేటికీ అది తప్పుగా సమాజం పరిగణిస్తోంది.
ఎన్నికలు రావాలి..ప్రభుత్వం తలవంచాలి
'ఝుక్తి హై దునియా, ఝుకానే వాలా చాహీహై' అనే పాత సినిమా పాట.ఎన్నికలు రావాలి..వస్తే ప్రభుత్వం తలదించటానికి రెడీ అయిపోతోంది. ఎన్నికలు జరగనంతవరకూ ప్రభుత్వం 56 అంగుళాల ఛాతీ అంటూ రొమ్ము విరుచుకుంటుంది. ఇపుడు ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి,
ఒక్కటి కాదు నాలుగుసార్లు..
1. గత రెండు నెలల్లో కేంద్రం నాలుగుసార్లు తలవంచింది. నాలుగుసార్లు సంస్థాగత వ్యతిరేకతకు లొంగిపోయింది. ముందుగా రైతుల ముందు మోడీ సర్కార్ తలదించింది. అమాంతంగా టీవీలో ప్రత్యక్షమై ప్రధాని క్షమాపణ కోరారు. నల్లచట్టాలను ఉపసంహరించుకున్నారు. తాజాగా మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు చెందిన (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్ గురించి తెరపైకి తెచ్చింది.
2. మదర్ థెరిసా సంస్థ కు చెందినఎఫ్సీఆర్ఏ లైసెన్స్‌ను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ పునరుద్ధరించలేదు. పైగా ఆ దరఖాస్తు పరిశీలనలో 'అడ్వర్స్ ఇన్పుట్' వచ్చిందనీ, దాని కారణంగా లైసెన్స్ పునరుద్ధరించబడలేదని మంత్రిత్వ శాఖ తరపున బుకాయిస్తోంది. దీని లైసెన్స్ గడువు డిసెంబర్ 31తో ముగిసింది. 'ప్రతికూల ఇన్పుట్' వచ్చిందో లేదో ప్రభుత్వం స్పష్టత నీయలేదు. కానీ దేశంలో, దేశం వెలుపల నిరసనలు ప్రారంభమైనప్పుడు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందుకు వచ్చారు. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ పనులు కొనసాగించడానికి రూ.లక్ష మంజూరు చేశారు. చివరికి మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.. లైసెన్స్‌ను పునరుద్ధరించింది. లైసెన్సు రెన్యువల్ చేసినప్పుడు 'ఎడ్వర్స్ ఇన్పుట్' ఏమైందో చెప్పలేదు. అది పాజిటివ్ ఇన్‌పుట్‌గా ఎలా మారింది? అని ప్రశ్న ఉదయిస్తోంది.
3. నీట్-పీజీ కౌన్సెలింగ్ విషయంలో ఢిల్లీ వైద్యులు సమ్మె చేయటంతో.. మోడీ సర్కార్ దిగివచ్చింది. ఓబీసీ రిజర్వేషన్లు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ఆదాయ పరిమితి అంశం తేలే వరకు కౌన్సెలింగ్ నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 26న సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ ఢిల్లీ వైద్యులు సమ్మె ప్రారంభించి, వివాదం ముదిరినప్పుడు, దేశ ప్రయోజనాల దృష్ట్యా కౌన్సెలింగ్ త్వరగా నిర్వహించాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో జనవరి 12 నుంచి నీట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది.
4. దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు రోడ్డుకెక్కి ఆందోళనలకు దిగటంతో..మోడీ ప్రభుత్వం వెనక్కితగ్గింది. బట్టలపై జీఎస్టీని ఐదు నుంచి 12 శాతానికి పెంచింది. ఇది జనవరి 1 నుంచి అమలు కావాల్సి ఉండగా.. అంతకుముందే దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో..ఎక్కడ కొంపమునుగుతుందోనన్న భయం వెంటాడింది. అప్పటికప్పుడు జనవరి 1న జీఎస్టీ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి జీఎస్టీ పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసింది.
ఎన్నికల బడ్జెట్ ప్రవేశపెడతా!
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. అయితే ఈ బడ్జెట్‌కు ప్రత్యేక అర్థం అంటూ ఉండదు. కేవలం ఎన్నికల తాయిలాలు మాదిరిగా ఉండ నున్నది. ఎందుకంటే ఈ బడ్జెట్లో ప్రకటించే లక్ష్యాలు చేరుకోవన్న విషయం బీజేపీ ప్రభుత్వానికి తెలుసు. కేవలం ఓట్లను దండుకోవటానికి ... రాజకీయ అవసరాలకనుగుణంగా పన్నులు వడ్డించటం ఖాయమని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ సాధారణ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ జరగనున్నది. అంతకంటే ముందే సాధారణ బడ్జెట్ వస్తుంది. సహజంగా ఎన్నికలే కావడం వల్ల బడ్జెట్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. గత ఏడాది కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు సాధారణ బడ్జెట్‌ను సమర్పించారు, అప్పుడు కూడా ఈ సమస్య తలెత్తింది .ప్రతి లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది .అప్పుడు కూడా ఈ ప్రశ్న తలెత్తుతుంది. కానీ ప్రభుత్వ ఎన్నికల మంత్రిత్వ శాఖగా రూపాంతరం చెందిన ఎన్నికల సంఘం.. సాధారణ బడ్జెట్ విషయంలో మాత్రం కాస్త ఊరడించే
భావన కలిగించటమే దీనివెనుక ఉద్దేశం.
గత రెండేండ్లుగా కరోనా పేరుతో దాదాపు 90 శాతం రైళ్లు నడవడం లేదు, అయితే బడ్జెట్లో కొత్త రైళ్లు, కొత్త స్టేషన్లు, రోడ్లు, చిన్న ,మధ్య తరహా పరిశ్రమల వరకు ప్రకటనలు ఉండొచ్చని నిపుణుల అంచనా. ఎకనామిక్ సర్వేలో దేశ ఆర్థిక వ్యవస్థ గులాబీ రంగును చూపి వృద్ధి రేటును పదుల సంఖ్యలో అంచనా వేయనున్నారు. అయితే దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయన్నది ప్రశ్న.
మహిళల్ని టార్గెట్ చేస్తూ..
మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కుతోంది.భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా సెల్ చీఫ్ జితేన్ గజారియా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రేను బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పోల్చారు. దీనిపై శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రష్మీ థాకరేను అవమానించడమేనన్నారు. ఒక్కసారి ఆలోచించండి, రష్మీ థాకరేని బీహార్ లాంటి పెద్ద రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి, మచ్చలేని రాజకీయ జీవితం ఉన్న మహిళా రాజకీయ నాయకురాలిగా పోల్చడం ఎంత అవమానం? అయినప్పటికీ రష్మీ థాకరేను రబ్రీ దేవితో పోల్చడాన్ని శివసేన నాయకులు, రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంగీకరించడం లేదు. వాస్తవానికి జితేన్ గజారియా 'మరాఠీ రబ్రీ దేవి' అని రాస్తూ రష్మీ థాకరే ఫోటోను పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి మహారాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు అతడ్ని అరెస్టు చేసిన నాలుగుగంటల్లోనే విడుదల చేయక తప్పలేదు. అదే బీజేపీకి వ్యతిరేకంగా ఎవ రైనా పోస్టు చేస్తే..రాజద్రోహం కేసులు పెట్టి..కటకటాలవెనక్కి నెడుతోంది.