Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తడబడిన ప్రధాని!
- టెలిప్రాంప్టర్ తప్పు.. ప్రధానిది కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు
- ప్రధాని అబద్ధాలు భరించలేకే మొరాయించింది : రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ : వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో సోమవారం నాటి ప్రధాని మోడీ ప్రసంగం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సదస్సులో ప్రధాని మోడీ టెలిప్రాంప్టర్ పరికరం సహాయంతో ఆంగ్లంలో ప్రసంగించారని వార్తలు వెలువడ్డాయి. టెలిప్రాంప్టర్ పరికరంలో లోపం తలెత్తడం వల్ల సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగం రెండు నిమిషాలపాటు నిలిచిపోయిందని సమాచారం. దీనిపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సహా పలువురు నాయకులు విమర్శలు చేశారు. సోషల్ మీడియాలోనూ ఇది చర్చనీ యాంశమైంది. ప్రధాని మోడీ చెప్పే అబద్ధాలను టెలిప్రాంప్టర్ భరించలేకపో యిందంటూ రాహుల్‌గాంధీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. టెలిప్రాంప్టర్‌లో ఎదో లోపం తలెత్తటం వల్లే ప్రధాని మాట్లాడలేకపోయారని, ముందస్తుగా రాసుకున్నది సరిగా కనిపించక (లేదా వినిపించక) ఆయన మాట్లాడలేక తడబడ్డారని సోషల్ మీడియాలో కొంతమంది వ్యాఖ్యానించారు.
దీనిపై ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా మాట్లాడుతూ..''టెలిప్రాంప్టర్‌లో లోపం ప్రధాని మోడీ తడబాడుటును బయటపెట్టింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రధాని ప్రసంగం వీడియో చూస్తే ఎవరికైనా సులభంగానే అర్థమవుతోంది. ప్రధాని ప్రసంగిస్తుండగా..మధ్యలో డబ్ల్యూఈఎఫ్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ క్లాస్ చాబ్ కలుగజేసుకొని..తనకు స్పష్టంగానే వినపడుతోందని చెప్పారు. తిరిగి ప్రధాని మోడీ ప్రసంగం మొదలుపెడుతూ... మొదట చెప్పిందే..మళ్లీ చెప్పారు. దీనిని బట్టి ఆయన ప్రసంగం టెలిప్రాంప్టర్ ద్వారా జరుగుతోందని భావించవచ్చు. ముందుగా రాసుకున్నది టెలిప్రాంప్టర్ చూపితే..దానిని ఆయన చదువుతున్నారు'' అని అన్నారు.
ఎమిటీ టెలిప్రాంప్టర్ ?
ముందస్తుగా రాసుకున్నదాన్ని వినిపించటం లేదా ప్రసంగ పాఠం కనిపించేలా చేయటం కోసం 'టెలిప్రాంప్టర్'ను వాడుతారు. ఇందులో అనేక రకాలున్నాయని, అత్యున్నత సాంకేతికతతో కూడిన టెలిప్రాంప్టర్ను ప్రధాని మోడీ వాడుతున్నారని సమాచారం! చూసేవాళ్లకు, వినేవాళ్లకు ప్రధాని మోడీ అనర్ఘళంగా ప్రసంగిస్తున్నారనే విధంగా కనపడుతుంది. ముందుగా రాసుకున్న ప్రసంగ పాఠం చదువుతున్నారనేది బయటకు కనపడదు. ప్రధాని మోడీ టెలిప్రాంప్టర్ పరికరంతో ప్రసంగిస్తారని గత కొంతకాలంగా కాంగ్రెస్ విమర్శిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తాజా ఉదంతం వారి ఆరోపణలకు మరింత బలాన్నిచ్చింది. ''టెలిప్రాంప్టర్తో ప్రసంగం ఇవ్వొచ్చు..కానీ పాలన చేయలేవు'' అంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విమర్శించారు.