Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థి సంఘాల ఆరోపణ
- ఏబీవీపీ ఓటమి భయంతోనే
లక్నో : ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వ ఒత్తిడితోనే రాష్ట్రంలో కళాశాల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ (ఎంజేకేవీపీ) యూనియన్ ఎన్నికలు ఇప్పటికి అనేకసార్లు వాయిదా పడ్డాయి. దీంతో విద్యార్థులు నిరసనలకు దిగారు. ప్రభుత్వం వీరిని గృహనిర్భంధంలో ఉంచింది. ఈ నెల 3న ఎంజేకేవీపీ 43వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కూడా హజరయ్యారు. అయితే ఇదే రోజున ఈ కళాశాలకు చెందిన అనేక మంది విద్యార్థులను ప్రభుత్వం గృహనిర్భంధంలో ఉంచింది. అన్యాయమైన కారణాలతో ఎన్నికలను వాయిదా వేస్తున్న ప్రభుత్వం తీరునకు వ్యతిరేకంగా గత ఏడాది నుంచి నిరసనలు చేస్తున్నారు. తమను నేరస్థులు మాదిరిగా ప్రభుత్వం ట్రీట్ చేస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 'అనేక రోజులుగా మేం నిరసన చేస్తున్నాం. గవర్నర్ను కలిసి మా సమస్యల గురించి ఫిర్యాదు చేయాలనుకున్నాం. కానీ మమల్ని అరెస్టు చేసి సిగ్రా పోలీస్ చౌకీ వద్ద ఉంచారు. క్రిమినల్స్ మాదిరిగా ట్రీట్ చేశారు' అని అభిషేక్ సొంకర్ అనే విద్యార్థి నేత తెలిపారు.
సాధారణంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు సెప్టెంబర్ నుంచి డిసెంబరు మధ్యలో జరుగుతాయి. అయితే ప్రభుత్వం అనేక కారణాలు చూపుతూ ఎన్నికలను పలుసార్లు వాయిదా వేస్తూ వస్తోంది. దీంతో విద్యార్థులు నిరసనలకు దిగుతుంటే వారిని పోలీసులు బెదిరించడం, హౌస్ అరెస్టు చేయడం చేస్తున్నారు. ప్రభుత్వం పైకి ఎన్ని కారణాలు చెబుతున్నా, అసలు కారణం మాత్రం ఏబీవీపీ ఓడిపోతుందనే భయంతోనే ఈ ఎన్నికలను యోగి ప్రభుత్వం వాయిదా వేస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గత ఐదేండ్లలో నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. 2017 నుంచి ఏబీవీపీ ఓటమి ప్రారంభమయింది. ప్రస్తుతం కూడా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ విద్యార్థి విభాగాలు ఎన్ఎస్యూఐ, ఎస్సీఎస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. ఈ కారణంగానే కళాశాలల ఎన్నికలను బీజేపీ ప్రభుత్వం వాయిదా వేస్తుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.