Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారిక లెక్కల కంటే 9 రెట్లు అధికంగా దరఖాస్తులు
- వాస్తవ సంఖ్యను దాచిన బీజేపీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : కరోనా మరణాలపై గుజరాత్ వాస్తవాలను దాచిందని స్పష్టమైంది. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయంపై సుప్రీంకోర్టు చేస్తున్న విచారణతో ఈ విషయం వెలుగులోకివచ్చింది. గుజరాత్ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 16 వరకూ 10,094 మంది కరోనాతో మరణించారు. అయితే ఆ తేదీ వరకూ దీనికి సుమారు తొమ్మిది రెట్లు అధికంగా అంటే 89,633 దరఖాస్తులు కరోనా పరిహారం కోసంవచ్చాయి. సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో గుజరాత్ ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 68,370 దరఖాస్తులకు పరిహారం ఇప్పటికే మంజూరు చేసినట్టుగా చెప్పడం గమనార్హం.
68,370 దరఖాస్తులకు పరిహరం ఇచ్చామని ప్రభుత్వం చెప్పిందంటే దానికి అర్థం అధికారికంగా చెబుతున్న 10,094 మరణాలు అబద్ధమని, కరోనాతో 68,370 మంది మరణించారని ప్రభుత్వమే ఒప్పుకున్నట్టు అర్ధం. అలాగే, ప్రస్తుతానికి ఇంకా 17 వేలకు పైగా దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని నివేదికలో ప్రభుత్వం తెలిపింది. అయితే ఇదే విషయాన్ని కెనడాకు చెందిన పరిశోధకలు ఇప్పటికే చెప్పారు. 2021లో గుజరాత్ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల కంటే 230 శాతం అధికంగా మరణాలు సంభవించాయని వారు తెలిపారు. వీరి అంచనా ప్రకారం గత ఏడాది ఏప్రిల్-మేలో నెలకు 39 వేలకు పైగా మంది మృతి చెందారు. భారత్‌లోని అన్ని రాష్ట్రాల కంటే గుజరాత్‌లోనే అధిక మరణాలు సంభవించాయని వీరి సర్వే వెల్లడించింది. ఇప్పుడు అదే నిజమయింది.