Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైలు నుంచి బలవంతంగా బయటకు దింపేసిన వైనం
- ఎంపీలో భజరంగ్‌దళ్ దుశ్చర్య
- సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌తో ఆలస్యంగా వెలుగులోకి
భోపాల్ : లవ్‌జీహాద్ ఆరోపణలతో దేశంలోని ముస్లింలపై హిందూత్వ శక్తుల దాడులు నిత్యకృత్యమయ్యాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఆందోళనను కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇటీవలే చోటు చేసుకున్న ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజ్మీర్‌కు వెళ్తున్న ఒక ట్రైన్లో హిందూ మహిళతో కలిసి ప్రయాణిస్తున్న ముస్లిం వ్యక్తిని హిందూత్వ సంస్థ భజరంగ్‌దళ్ కార్యకర్తలు దాడి చేశారు. ఆ ఇద్దరినీ ట్రైన్ నుంచి బలవంతంగా బయటకు లాగి మరీ ఈ దారుణానికి తెగబడ్డారు. ఈ నెల 14న ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందూ మహిళ, ముస్లిం వ్యక్తి ఆసిఫ్ షేక్ కలిసి అజ్మీర్‌కు పోయే ట్రైన్లో వెళ్తున్నారు. అయితే, భజరంగ్‌దళ్ కార్యకర్తలకు వీరిద్దరు కలిసి వెళ్తున్న సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకొని ట్రైన్లో ఉన్న ఆ ఇద్దరిని బెదిరించారు. వారిని రైలులో నుంచి బలవంతంగా బయటకు దింపారు. 'లవ్‌జీహాద్'తో హిందూ మహిళను తీసుకెళ్తున్నాడని ఆరోపిస్తూ ఆసిఫ్‌పై భజరంగ్‌దళ్ కార్యకర్తలు దాడికి దిగారు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో ఇదంతా కనిపించింది.
అనంతరం భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆ ఇద్దరిని ఉజ్జయిన్ రైల్వే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. ఆ ఇద్దరి తల్లిదండ్రులు వచ్చే వరకు వారు పోలీసు స్టేషన్లోనే ఉన్నారు. పోలీసులు ఆ ఇద్దరి వాంగ్మూలాలను తీసుకున్నాక పంపించారు. తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనీ, తనకు ఇప్పటికే పెండ్లి కూడా అయిందని మహిళ పోలీసులకు చెప్పింది. ఈ విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసు సూపరింటెండెంట్ నివేదిత గుప్తా వెల్లడించారు. ఆ ఇద్దరు కలిసివెళ్లడంలో ఎలాంటి తప్పూ లేదనీ, వాంగ్మూలం అనంతరం వారిద్దరినీ పంపించినట్టు వివరించారు. అయితే, ఎలాంటి ఫిర్యాదూ అందకపోవడంతో బజరంగ్దళ్ కార్యకర్తలపై కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. కాగా, ఈ దాడి ఘటనను సామాజిక కార్యకర్తలు, పౌర సంఘాల నాయకులు, నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. భజరంగ్‌దళ్ వంటి హిందూత్వ సంస్థలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మైనారిటీలపై దాడులు చేస్తున్నాయనీ, ఇది చాలా దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.