Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత 8ఏండ్లులో అసమానతలు వేగంగా పెరిగాయి : ఆక్స్‌ఫాం ఇండియా
న్యూఢిల్లీ : భారత్‌లో ధనికులు, కార్పొరేట్లపై ఒక్కశాతం పన్ను విధిస్తే..దేశంలో అసమానతల్ని 10శాతం తగ్గిస్తుందని 'ఆక్స్‌ఫాం ఇండియా' తాజా నివేదిక తెలిపింది. ప్రజా సంక్షేమానికి కోతలు విధించి, ధనికులు, కార్పొరేట్లకు పన్ను ప్రయోజనాలు కల్పించారని, వారికి అనుకూలమైన ఆర్థిక విధానాలు అమలుజేస్తున్నారని, అందువల్లే అసమానతలు పెరిగాయని నివేదిక పేర్కొన్నది. కరోనా సంక్షోభ సమయం (మార్చి 2020-నవంబర్ 2021)లోనూ భారత్‌లో శతకోటీశ్వరుల(బిలియనీర్ల) సంఖ్య పెరిగిందని కొద్ది రోజుల క్రితం 'ఆక్స్‌ఫాం ఇండియా' ఒక నివేదికను విడుదల చేసింది. 'ఇనీక్వాలిటీ కిల్స్ : ఇండియా సప్లిమెంట్ 2022' పేరుతో విడుదలైన ఈ నివేదికలో మరికొన్ని వివరాలు మీడియాకు విడుదలయ్యాయి.
దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. భారత్‌లో అసమానతలు ఉండటం, పెరగటం కొత్తేమీ కాదు. అయితే మోడీ సర్కార్ వచ్చాక గత 8 ఏండ్లలో అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి. 'సబ్కా సాత్, సబ్కా వికాస్' ప్రచార పటాటోపం తప్ప..మరోటి కాదు. ఇందులో స్థిరమైన అభివృద్ధి లక్ష్యం లేదు. బడా కార్పొరేట్స్ 98మంది వద్ద ఉన్న సంపద..దేశ జనాభాలో 40శాతం మంది సంపదకు సమానం. అసమానతల్ని రూపుమాపాలంటే ధనికులు, కార్పొరేట్స్పై పన్నులు పెంచాలి. తద్వారా వచ్చే పన్ను రాబడితో పాఠశాల, ఉన్నత విద్య కోసం 25ఏండ్లకు సరిపడా నిధులు సమకూరుతాయి.
ఆర్థిక విధానాలే అసలు కారణం : అమితాబ్ బెహర్, సీఈవో, ఆక్స్‌ఫాం ఇండియా
ఆర్థిక అసమానతలు పెరగడానికి ప్రధాన కారణం కేంద్రం ఎంచుకున్న ఆర్థిక విధానాలే. అంతేకాదు పేదరికం పెరగడానికి కూడా ఇదే కారణం. సమానత్వం, స్థిరమైన అభివృద్ధికి దారితీసే ఆర్థిక విధానాలు ఎంచుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కోవిడ్ సంక్షోభం, పేదరికంపై భారత్ ఓ వైపు పోరాటం చేస్తుంటే..దేశంలో బిలియనీర్లు డబ్బుల మూటలు పోగేసుకున్నారు. రికార్డుస్థాయిలో లాభాల్ని ఆర్జించారు. కేంద్రం అమలుజేస్తున్న పన్నుల విధానంలోనే తప్పుంది. ప్రజలపై పరోక్ష పన్నులు పెంచుతూ..కార్పొరేట్స్‌కు పన్ను ప్రయోజనాల్ని ఇస్తోంది. అందువల్లే ప్రజా వైద్యానికి సరిపడా నిధులు రావటం లేదు.