Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన పాజిటివిటీ రేటు
- దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ 3 లక్షలకు సమీపించాయి. రెండు రోజుల నుంచి కరోనా కేసులు కాస్త తగ్గినట్టు కనిపించినప్పటికీ.. బుధవారం నాడు కరోనా మహమ్మారి సోకిన వారి సంఖ్య భారీగా పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మంగళవారం 18 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా... 2.82 లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోలిస్తే 18శాతం అదనం. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 441 మంది మరణించారు. దీంతో కరోనా మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 3.79 కోట్ల మందికి పైగా ప్రజలు మహమ్మారి బారిన పడగా... 4.87 లక్షల మంది కరోనాకు బలయ్యారు. పాజిటివిటీ రేటు 14.43 శాతం నుంచి 15.13 శాతానికి పెరిగింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 8,916కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,88,157 మంది కోలుకోగా.. మొత్తంగా 3.55 కోట్ల మంది మహమ్మారిని జయించారు. ప్రస్తుతం క్రియా శీల కేసులు 18 లక్షలుగా ఉన్నాయి. క్రియా శీలక రేటు 4.83 శాతానికి పెరిగింది. క్రితం రోజు 76,35,229 మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 158 కోట్లకు పైగా డోసులు పంపిణీ పూర్తయినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.
మార్చి నాటికి ఎండమిక్ దశకు... : ఐసీఎంఆర్ నిపుణుడి అంచనా
మార్చి నెలకల్లా కరోనా మహమ్మారి ఎండమిక్ దశకు చేరుకోవచ్చునని ఐసీఎంఆర్ వైద్య నిపుణుడు సమీరన్ పాండా అంచనా వేశారు. 'మనం కోవిడ్ నిబంధనలను పాటించే విషయంలో అశ్రద్ధ వహించకుండా ఉంటే, కొత్త వేరియంట్లు పుట్టుకురాకపోతే.. మార్చి 11 కల్లా కరోనా వైరస్ ఎండమిక్కు చేరుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిపుణుల బందం అంచనా ప్రకారం.. డిసెంబర్ 11తో ప్రారంభమైన ఒమిక్రాన్ వేవ్ మూడు నెలల పాటు ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ, ముంబయిలో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు సుమారుగా 80:20 నిష్పత్తిలో ఉన్నాయన్నారు. మహమ్మారి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో ఉందనీ, దానికి తగ్గట్టే ఐసీఎంఆర్ పరీక్షా వ్యూహాలు మారుస్తుందని తెలిపారు.