Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్యరాజ్య సమితిని కోరిన భారత్ రాయబారి
న్యూఢిల్లీ : బౌద్ధ మతం, సిక్కుమతంపై తలెత్తుతున్న మతపరమైన విద్వేష చర్యలతో పాటు హిందూ ఫోబియాను కూడా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారి టి.ఎస్.త్రిమూర్తి ఐక్యరాజ్య సమితిని కోరారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (జీసీటీసీ) నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. గతేడాది ఐక్యరాజ్య సమితి ఆమోదించిన అంతర్జాతీయ తీవ్రవాద నిరోధక వ్యూహం పూర్తిగా లోపాలు, లొసుగులతో నిండివుందని అన్నారు. పైగా సెప్టెంబరు 11 దాడుల అనంతరం ప్రకటించిన ''తీవ్రవాదంపై యుద్ధం'' డిక్లరేషన్‌పై నెలకొన్న అంతర్జాతీయ ఏకాభిప్రాయంతో సాధించిన ప్రయోజనాలు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయన్నారు. అయితే తీవ్రవాదానికి ఇచ్చే నిర్వచనంలో కొత్త కొత్త పదాలు చేర్చడం పట్ల భారత ప్రభుత్వం అసౌకర్యంగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. గత రెండేండ్లుగా అనేక సభ్య దేశాలు వారి వారి రాజకీయ, మతపరమైన, ఇతర రకాల కారణాలతో తీవ్రవాదాన్ని రకరకాలుగా వర్గీకరించడానికి ప్రయత్నిస్తూ వచ్చారని ఆయన పేర్కొన్నారు. జాతుల పేరుతో జరిగే తీవ్రవాద చర్యలు, వర్ణ వివక్షతతో చేపట్టే తీవ్రవాద చర్యలు, హింసాత్మక తీవ్రవాదం, జాతీయవాదం పేరుతో జరిగే హింస, మితవాద తీవ్రవాదం ఇలా పేర్లు పెడుతున్నారని, కానీ ఈ ధోరణి చాలా ప్రమాదకరమైందని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని తీవ్రవాద కమిటీ (సీటీసీ)కి ఈ ఏడాదికి భారత్ చైర్మెన్‌గా వుంది. భారత్ పదవిలో వున్నంత కాలం తీవ్రవాదంపై భద్రతా మండలిలో జరిగే చర్చల్లో ఇటువంటి పదాలను చేర్చడాన్ని భారత్ వ్యతిరేకిస్తుందని త్రిమూర్తి ఈ మేరకు గట్టి సంకేతాలు పంపారు.