Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధ్రువీకరించిన సుప్రీం
- మెరిట్ మాత్రమే కాదు, వారి సామాజిక, సాంస్కృతిక నేపథ్యమూ అవశ్యమేనని స్పష్టీకరణ
న్యూఢిల్లీ : నీట్ అడ్మిషన్లలో ఓబీసీ కోటాకు గల రాజ్యాంగ చెల్లుబాటును సుప్రీం కోర్టు గురువారం సమర్ధించింది. అండర్గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులకు గానూ అఖిల భారత స్థాయిలో నీట్ ప్రవేశాల్లో ఇతర వెనుకబడిన వర్గాల(ఓబీసీ)కు 27శాతం కోటా వుండాలని స్పష్టం చేసింది. బహిరంగ పోటీతో జరిగే పరీక్షల్లో మెరిట్ అనే దాన్ని సంకుచిత స్వభావంతో చూడలేమని, అది విజయం పరిధిని తగ్గించలేదని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఒక వ్యక్తి మెరిట్ అనేది వారి జీవిత అనుభవాలు, వారి సాంస్కృతిక, సామాజిక నేపథ్యాలను, ఇతర అడ్డంకులను అధిగమించేందుకు జరిపిన పోరాటంతో కలిపే చూడాలని బెంచ్ వ్యాఖ్యానించింది.
''బహిరంగ పోటీతో జరిగే పరీక్షల్లో సమాన అవకాశాలు లాంఛనప్రాయంగా కల్పించబడతాయని, అటువంటపుడు పనితీరు, సామర్ధ్యం అనే సంకుచిత నిర్వచనాల స్థాయికి మెరిట్‌ను కుదించలేమని జస్టిస్ చంద్రచూడ్ తీర్పులో పేర్కొన్నారు. ప్రస్తుతం సామర్ధ్యాలను పోటీ పరీక్షల ద్వారానే అంచనా వేస్తున్నారు. కానీ, అభ్యర్ధుల్లోని నైపుణ్యాలు, వారి ప్రతిభ, సామర్ధ్యం వంటి వాటిని ప్రతిబింబించేలా పరీక్షలు వుండడం లేదని అన్నారు. వ్యక్తిగత జీవితానుభవాలు, వారి స్వభావం, వ్యక్తిత్వం వల్ల కూడా ఇవి ప్రభావితమవుతాయని చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ తీర్పు తమిళనాడు వంటి రాష్ట్రాలకు విజయం అందించింది. ఎయిడెడ్ లేదా అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల సమయంలో ప్రత్యేక నిబంధనలను రూపొందించేందుకు, వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలకు అధికారాలు వున్నాయని కోర్టు ధ్రువీకరించింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను లేదా ఎస్సీ, ఎస్టీలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గానూ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా రాష్ట్రాలు ఈ నిబంధనలను వర్తింపచేసే అధికారం వుందని పేర్కొంది. ఒక వ్యక్తికి గల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాలు వారి విజయానికి ఏ విధంగా దోహదపడతాయనేది ఈ పరీక్షలు ప్రతిబింబించవని కోర్టు పేర్కొంది. మెరిట్ అంటే కేవలం పరీక్షల్లో సాధించిన తీరుగానే చూడరాదు, రిజర్వేషన్ మెరిట్‌తో విభేదించదు, కానీ దాని ప్రభావాన్నిమరింత పెంచుతుందని కోర్టు పేర్కొంది.