Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల ఆమోదం లేకుండానే కేంద్రానికి డిప్యుటేషన్
- ఈ మేరకు రూల్ నెంబరు 6కు సవరణల ప్రతిపాదన
- బెంగాల్, కేరళ సహా ఆరు రాష్ట్రాల వ్యతిరేకత
న్యూఢిల్లీ : ఐఏఎస్ కేడర్ నిబంధనలు మార్చాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కసరత్తులు ప్రారంభించింది. ఫెడరలిజం స్ఫూర్తిని కాలరాస్తూ, రాష్ట్రాల అధికారాలను లాక్కునేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేకుండానే కేంద్ర డిప్యూటేషన్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చూస్తోంది. ఐఏఎస్ కేడర్ నిబంధనలు 1954లో ఆరవ నిబంధన (కేడర్ అధికారుల డిప్యూటేషన్)ను సవరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోందంటూ జనవరి 12న కేంద్ర సిబ్బంది, శిక్షణా విభాగం (డీఓపీటీ) రాష్ట్రాలకు లేఖ రాసింది. కేంద్ర ప్రతిపాదన కారణంగా రాష్ట్రాలతో ముఖ్యంగా ప్రతిపక్షాల పాలనలో వున్న రాష్ట్రాలతో కేంద్రం ఘర్షణ పడేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. అయితే ఇలాంటి ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరిస్తూ ఇప్పటికే ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు డీఓపీటీకి లేఖలు రాశాయని తెలుస్తోంది. బీజేపీ దాని మిత్రపక్షాల పాలనలో వున్న రాష్ట్రాల నుంచి కూడా ఇటువంటి వైఖరే వ్యక్తమైంది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో అల్ ఇండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కొరత బాగా వుందని కేంద్రం రాసిన లేఖ ద్వారా తెలుస్తోంది. కేంద్ర అవసరాలు తీర్చేలా అధికారుల సంఖ్య లేదని, పైగా కేంద్ర డిప్యూటేషన్ కోసం తగినంతమంది అధికారులను రాష్ట్రాలు పంపడం లేదని డీఓపీటీ తన లేఖలో పేర్కొంది. రాష్ట్రాలు తమ ప్రతిపాదనపై స్పందించాలని కోరుతూ డిసెంబరు 20, 27, జనవరి 6న కేంద్రం లేఖలు రాసింది. దీనికి కేవలం ఆరు రాష్ట్రాలు వ్యతిరేకతను వ్యక్తం చేయగా, మిగిలినవి స్పందించలేదు. దాంతో ఆ ప్రతిపాదనను మరింత సవరించారు. జనవరి 25లోగా స్పందించాలంటూ రాష్ట్రాలకు గడువు విధించారు. రాష్ట్రాలు స్పందించని పక్షంలో డీఓపీటీ మంత్రిత్వశాఖ రిమైండర్లు పంపుతుందని, ఆ తర్వాత నిబంధనలను గెజెట్‌లో ప్రచురించడం ద్వారా నోటిఫై చేస్తుందని సీనియర్ అధికారి తెలిపారు.
కేరళ, బెంగాల్ సహా ఆరు రాష్ట్రాల వ్యతిరేకత
ఈ ప్రతిపాదన సహకార ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధంగా వుందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఫెడరలిజం సిద్ధాంతానికి విరుద్ధంగా వుందంటూ కేరళ న్యాయ శాఖ మంత్రి పి.రాజీవి కూడా లేఖ రాశారు. అయితే దీనిపై తమ ప్రభుత్వం ఇంకా పరిశీలన చేయాల్సి వుందన్నారు. కేంద్రం చేతిలోనే అధికారాలన్నీ కేంద్రీకరించే యత్నాలను తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
నాలుగు సవరణలు
రూల్ నెంబరు 6కు నాలుగు సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అందులో ప్రధానమైన సవరణ-స్టేట్ కేడర్‌కి చెందిన అధికారిని కేంద్రానికి పంపడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తే, నిర్దిష్ట కాలపరిమితిలోగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించకపోతే, కేంద్రం పేర్కొన్న తేదీనాటికి ఆ అధికారి వెంటనే ఆ కేడర్ నుండి రిలీవ్ చేయబడతారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం, కేంద్ర డిప్యూటేషన్‌కు గానూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుండి నో అబ్జెక్షన్ పత్రం తీసుకోవాల్సి వుంటుంది.