Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 75 ఏండ్లలో జరిగిన అభివృద్ధితోనే విదేశాల్లో ప్రధానికి గౌరవం
- మోడీ పాల్గొన్న ఒక సభలో రాజస్థాన్ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ పాల్గొన్న ఒక సభలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉద్రిక్త, హింసాత్మక వాతావరణం నెలకొని ఉన్నదని చెప్పారు. శాంతి, మత సామరస్యం కోసం పని చేయాల్సిన అవసరాన్ని దేశం నొక్కి చెప్పాలన్నారు. బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో 'ఆజాదీ కే అమృత్ మహౌత్సవ్ సే స్వర్ణిమ్ భారత్ కే ఓర్' కార్యక్రమం వర్చువల్గా జరిగింది. ఈ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్ సీఎం ఈ వ్యాఖ్యలు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో 70 ఏండ్లుగా అభివృద్ధి జరగలేదనే కథనాన్ని.. రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ ఉపయోగిస్తున్నాయని గెహ్లట్ అన్నారు. '' దేశంలో శాంతి, సామరస్యం పెరగాలి. బలోపేతమవ్వాలి'' అని ఆయన అన్నారు. గత 75 ఏండ్లలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందిన కారణంగానే ప్రధాని పర్యటించిన అనేక దేశాల్లో గౌరవం లభించిందని చెప్పారు. అయితే, మోడీ మాత్రం సీఎం వ్యాఖ్యలపై స్పందించకపోవడం గమనార్హం. కాగా, సీఎం వ్యాఖ్యలను రాజస్థాన్ క్యాబినేట్ మంత్రి ప్రతాప్ సింగ్ ఖచారియావాస్ సమర్థించారు. బీజేపీ.. సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టింది.