Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురిని అరెస్టు చేసిన ముంబయి పోలీసులు
- 'క్లబ్‌హౌజ్ యాప్'లో ఈ కామెంట్లు చేసిన నిందితులు
ముంబయి : సామాజిక మాధ్యమంలో ముస్లిం మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ముగ్గురుని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఆడియో చాట్ యాప్ క్లౌబ్హౌజ్ యాప్‌లో నిందితులు ఈ వ్యాఖ్యలు చేశారు. 'సల్లీ డీల్స్', 'బల్లీ బారు' యాప్‌లలో ''ఆన్లైన్ ఆక్షన్'' కోసం ముస్లిం మహిళల ఫోటోలను ప్రచురించిన ఘటనలు ఇటీవల తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే సామాజిక మాధ్యమంలో ముస్లిం మహిళలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన తాజా ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. '' అసభ్యకరమైన క్లౌబ్హౌజ్ యాప్ చాట్‌పై కేసు నమోదు చేశాం. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశాం'' అని పోలీసు అధికారి (క్రైం) మిలింద్ భరంబే తెలిపారు. నిందితుడిని మూడు రోజుల సిట్ రిమాండ్‌కు పంపినట్టు చెప్పారు. మరో ఇద్దరు నిందితులను ఫరీదాబాద్ నుంచి అందుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారి ట్రాన్సిట్ రిమాండ్ ప్రక్రియ పురోగతిలో ఉన్నదని చెప్పారు. నిందితులు ఆకాశ్ సుయాల్ (19), జైష్ణవ్ కక్కర్ (21), యశ్ పరాశర్ (22)లపై ఐపీసీలోని పలు చట్టాలతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 కింద కేసులు నమోదయ్యాయి.
ఈ ముగ్గురు క్లౌబ్హౌజ్ యాప్‌లో ముస్లిం మహిళల అందం గురించి పోలుస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ప్యానెల్ నివేదిక అనంతరం ఢిల్లీ పోలీసులు పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టులపై ముంబయి పోలీసులను శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అభినందిస్తూ ట్వీట్ చేశారు.