Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతికి కర్నాటకలోని గెస్ట్ లెక్చరర్ల లేఖ
బెంగళూరు : రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ డిమాండ్లను నేరవేర్చడానికి తిరస్కరించడంతో కారుణ్య మరణానికి అనుమతించాలని కర్నాటకలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్లు రాష్ట్రపతికి లేఖ రాసారు. ఈ విషయాన్ని హస్సన్ జిల్లాలోని లెక్చరర్లు వెల్లడించారు. శుక్రవారం లేఖ రాసినట్లు తెలిపారు. గెస్ట్ లెక్చరర్ల కోర్డినేషన్ కమిటీ హస్సన్ జిల్లా విభాగం అధ్యక్షులు యతీష్ కబ్బల్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 953 మంది, కర్నాటకలో మొత్తంగా 14,500 మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారని తెలిపారు. వీరంతా కూడా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతికి పోస్టు కార్డులపై లేఖ రాసినట్లు చెప్పారు. పోస్టుకార్డులను మీడియా ముందు ప్రదర్శించారు. గెస్ట్ లెక్చరర్లుగా పని చేస్తున్నా కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసనలు, విధుల బహిష్కరణ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరణం తప్ప మాకు వేరే మార్గం లేదని చెప్పారు. తమ డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం మరోవైపు తమను విభజించడానికి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.