Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో నీరసిస్తున్న మహిళలు,చిన్నారులు
- ఆగని రక్తహీనత..శిశమరణాలు
- జాతీయకుటుంబఆరోగ్యసర్వే-5లో వెల్లడి
లక్నో..ఉత్తరప్రదేశ్‌లో ఆరు నెలల నుంచి 59 నెలల లోపు పిల్లల్లో 66.4 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్టు తేలింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ మునుపటి సర్వే అంటే నాల్గవ సర్వేలో రక్తహీనతతో బాధపడుతున్న పిల్లల సంఖ్య 63.2 శాతం.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 ప్రకారం..ఎన్నికల రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో పిల్లల్లో రక్తహీనత కేసుల్లో పెరుగుదల నమోదైంది. రక్తహీనతతో బాధపడుతున్న పిల్లల సంఖ్య గ్రామీణ , పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ సర్వే 66.4 శాతం మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇందులో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో 66.7 శాతం కేసులు నమోదు కాగా, పట్టణ ప్రాంతాల్లో 65.3 శాతం కేసులు నమోదయ్యాయి. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను పరిశీలిస్తే.. యోగి ప్రభుత్వం చెబుతున్నట్టు...గత ఐదేండ్లలో..ఆశించినరీతిలో అభివృద్ధి జరగలేదని స్పష్టమవుతోంది. ఎన్హెచ్ఎఫ్ఎస్-5 నివేదిక ప్రకారం, రాష్ట్రంలో 15-49 సంవత్సరాల వయస్సు గల గర్భిణీయేతర స్త్రీలలో రక్తహీనత శాతం 50.6 కాగా, ఎన్హెచ్ఎఫ్ఎస్ -4 నివేదికలో ఇది 52.5 శాతమే. ఆ సమయంలో.. అదే వయస్సు గల గర్భిణీ స్త్రీలలో రక్తహీనత శాతం 45.9 కాగా, గత సర్వేలో ఈ సంఖ్య 51 శాతంగా ఉంది.
ఆందోళనకరంగా పిల్లల మరణాలు
ఉత్తరప్రదేశ్‌లో చిన్నారుల మరణాల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నది. ఇక్కడ ప్రతి 1000 మంది పిల్లలలో దాదాపు 60 మంది పిల్లలు ఐదేండ్లలోపే మరణిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్హెచ్ఎఫ్ఎస్) ఇటీవలి నివేదిక ప్రకారం, ఈ మరణాల రేటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలో అత్యధికంగా(62.5శాతం) ఉన్నది. ఇక గ్రామీణ ప్రాంతంలో ఇది 49.7 శాతం.
ఉత్తమస్థితిలో కేరళ
ఎన్హెచ్ఎఫ్ఎస్ డేటా ప్రకారం ఈ వయస్సు పిల్లల మరణాల రేటు వెయ్యికి ఆరు ఉన్న కేరళలో ఉత్తమస్థితిలో ఉన్నది.జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యి మంది చిన్నారులకు శిశు మరణాల రేటు 42 మంది ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య దాదాపు 46 మంది ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు ప్రతి వెయ్యి మంది పిల్లలకు 31.5గా ఉన్న విషయం తెలిసిందే.
పోషకాహార లోపంతో...
2020 నవంబర్ నాటికి దేశవ్యాప్తంగా 9,27,606 మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతుంటే..యూపీలో 3,98,359 లక్షల మంది పిల్లలు ఉన్నారని తెలిపింది. యోగి సర్కార్ ఇచ్చిన ఈ గణాంకాలను పరిశీలిస్తే.. యూపీలో పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదో అంచనా వేయవచ్చు.
గత ఏడాది విడుదల చేసిన బహుమితీయ పేదరిక సూచీలో పేదరికంలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే మూడో పేద రాష్ట్రంగా నిలిచింది. రాష్ట్ర జనాభాలో 38 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. మరోవైపు, పోషకాహార లోపంలో యూపీ నాలుగో స్థానంలో ఉన్నది. ఇక్కడ జనాభాలో 44 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
వైద్యుల కొరత
పోషకాహార లోపం, ఇతర వ్యాధులతో పాటు పిల్లలకు సకాలంలో వైద్యం అందకపోవడం కూడా అకాల మరణాలకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో వైద్యుల కొరత ప్రధాన సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం ప్రతి 1,000 మందికి ఒక డాక్టర్ నిష్పత్తి ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ జనాభా దాదాపు 20 కోట్లు. ఈ విధంగా, రాష్ట్రంలో కనీసం 20 లక్షల మంది వైద్యులు ఉండాలి. అయితే 2019 సెప్టెంబర్ 30 నాటికి ఉత్తరప్రదేశ్‌లో కేవలం 81,348 అల్లోపతి వైద్యులు మాత్రమే నమోదు చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 7న లోక్‌సభలో సమర్పించిన డేటాను ఇండియాస్పెండ్ ఉటంకించింది. ఈ లెక్కన రాష్ట్రంలో అవసరానికనుగుణంగా దాదాపు 60 శాతం వైద్యుల కొరత ఏర్పడింది. రాష్ట్ర జనాభాలో 75 శాతానికి పైగా గ్రామాలలో నివసిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)పై ఆరోగ్యసేవలకోసం ప్రజలు ఆధారపడుతారు. ఈ రెండింటితో సహా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 3,664 మంది వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల జనాభా 15.5 కోట్లు. మరోవైపు, గైనకాలజిస్ట్ , ప్రసూతి వైద్యుల గురించి పరిశీలిస్తే... 2019 సంవత్సరంలో రాష్ట్రంలో 2716 పోస్టులు అవసరం కాగా, అందులో 484 పోస్టుల్లో మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 2232 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుజరాత్ మోడల్ గా చేస్తామని మోడీ సర్కార్ అన్న మాటలు..గుజరాత్‌లోనే కాదు..యూపీలోనూ అస్సలు లేవని రాజకీయపరిశీకులు అభిప్రాయపడుతున్నారు.