Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నారాయణ గురు సంఘ సంస్కర్త.. వివక్షపై పోరాడారు
- అందుకే ఆయన ముఖచిత్రంతో కేరళ శకటం : ప్రధానికి లేఖలో సీఎం పినరరు విజయన్
న్యూఢిల్లీ : భారత గణతంత్ర దినోత్సవం పరేడ్లో కేరళ ప్రభుత్వం ప్రచార రథాన్ని (శకటం) మోడీ సర్కార్ తిరస్కరించటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కేరళ శకటాన్ని ఎందుకు తిరస్కరించిందో కేంద్రం చెప్పటం లేదు. ఈ అంశంపై కలగజేసుకొని సమస్యను పరిష్కరించాలని కేరళ సీఎం పినరరు విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేరళ శకటంపై నారాయణ గురు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పంపిన ప్రచారరథంలో నేతాజీ సుభాష్ చంద్రబోసు బొమ్మలు పెట్టడానికి కేంద్రం వీల్లేదని చెబుతోంది. అలాగే తమిళనాడు పంపిన శకటంపై చిదంబరం పిళ్లై బొమ్మ పెట్టినందుకు తిరస్కరించింది. గణతంత్ర వేడుకల్లో ఆయా రాష్ట్రాల ప్రచార రథాల్ని కేంద్రం తిరస్కరించటం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది.
కేరళ శకటాన్ని గణతంత్ర వేడుకల్లో ఎందుకు ప్రదర్శించాలి? ఏ ఉద్దేశంతో దీనిని రూపొందించాం? అనేది తెలియజేస్తూ సీఎం విజయన్ ప్రధానికి లేఖ రాశారు. కేరళ ప్రభుత్వం పంపిన ప్రచార రథంపై సంఘ సంస్కర్త, ఆధ్యాత్మక గురువు నారాయణ గురు, రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మలు ఉండటాన్ని మోడీ సర్కార్ తిరస్కరిస్తోంది. ఎందుకు తిరస్కరిస్తుందో అధికారికంగా బయటకు చెప్పటం లేదు. ఇది కాస్తా జాతీయ మీడియాలో చర్చనీయాం శమైంది. అయితే దీనిపై స్పందించిన కేరళ సీఎం పినరరు విజయన్ ప్రధాని మోడీకి రాసిన లేఖలో పలు విషయాలు ప్రస్తావించారు. ప్రస్తుతం దేశ యువతకు ఒక సందేశం ఇవ్వడం కోసం కేరళ ప్రభుత్వం ఈ శకటాన్ని తీసుకొచ్చిందని లేఖలో వివరించారు.
''గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన కోసం కేరళ పంపిన శకటంపై సంఘ సంస్కర్త, గ్రేట్ ఫిలాసఫర్ నారాయణ గురు చిత్ర పటం ఉంది. కేరళలో సంఘ సంస్కరణలు, హక్కుల ఉద్యమం, సామాజిక పునరుజ్జీవనానికి ఆయన నేతృత్వం వహించారు. ఆయన ఆలోచనలు, ఆదర్శాలు దేశంలో ఎంతోమందిని ఆకర్షించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు ఉంది. సమాజంలో వివక్ష, అంటరానితనంపై నారాయణ గురు అలుపెరగని పోరాటం చేశారు. మనుషుల్లో సోదరభావాన్ని పెంపొందేందుకు పోరాడారు. విద్యా హక్కు, స్వేచ్ఛ కోసం నినదించారు. ఆయన సందేశాన్ని నేటి యువతకు పంపాలన్న ఉద్దేశంతో శకటాన్ని కేరళ ప్రభుత్వం పంపింది'' అని లేఖలో సీఎం విజయన్ ప్రధానికి వివరించారు.