Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యానిఫెస్టో విడుదల
లక్నో: వచ్చేనెలలో జరగనున్న యుపి అసెంబ్లీ ఎన్నికలు సర్వత్రా ఆసక్తి కరంగా మారాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించే ఈ ఎన్నికలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తు న్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ విషయంపై ప్రియాంక గాంధీ శుక్రవారం పెద్ద హింట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రియాంక గాంధీ శుక్రవారం పార్టీ యూత్ మేనిఫెస్టోను విడుదల చేశారు. యువతకు పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. ఉపాధి అవకాశాల కల్పన ప్రధాన ఎజెండాగా పేర్కొన్నారు. అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ప్రియాంక స్పందిస్తూ.. ''ఇంకెవరైనా కన్పిస్తున్నారా? ఎక్కడ చూసినా నేనే కన్పిస్తున్నానుగా..! చూడట్లేదా?'' అని సమాధానమిచ్చారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి అఖిలేశ్ యాదవ్‌లు ఈసారి ఎన్నికల్లో పోటీపడనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఇచ్చిన హింట్‌తో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమె పేరు ఖాయమైనట్టు కనిపిస్తోంది.ఒకవేళ యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికస్థానాలు గెలిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ ప్రియాంక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం వుంది. అయితే ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసనసమండలి ఏదో ఒకదానికి ఎన్నికకావ్వాల్సి ఉంటుంది. గతంలో యూపీ సిఎంగా బాధ్యతలు చేపట్టిన మాయావతి, అఖిలేశ్ యాదవ్‌తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఎమ్మెల్సీలే కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో యోగి గోరఖ్‌పూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. 403 అసెంబ్లీ స్థానాలున్న యుపిలో ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.