Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్లతో ఆన్లైన్ సమావేశంలో ప్రధాని
- పథకాల అమలుకు అది ముఖ్యం
- ప్రజల జీవనాన్ని మెరుగుపరచాలి
న్యూఢిల్లీ : ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు ప్రతి జిల్లాకు రెండేండ్ల విజన్ నిర్దేశించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలు జరుగుతున్న తీరు, వాటి పురోగతి గురించి నేరుగా తెలుసుకునేందుకు ఆయన శనివారం నాడు వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు, సేవలు, సదుపాయాలు నూరు శాతం సాకారమయ్యేలా చేసేందుకు, ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకుగాను వచ్చే రెండేళ్లకు 'విజన్' రూపొందించుకోవాలని జిల్లాల కలెక్టర్లను ప్రధాని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగం కలిసికట్టుగా పని చేయడం వల్ల ఆశావహ జిల్లాల్లో సత్ఫలితాలు వచ్చాయన్నారు. 22 రాష్ట్రాల నుంచి గుర్తించిన 142 జిల్లాలు ఏవో రెండు కొలబద్దల్లో వెనుకబడి ఉన్నంత మాత్రాన వాటిని వెనుకబడిన జిల్లాలు అని చెప్పలేమని అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. అభివృద్ధి పథంలో అడ్డంకులను తొలగించడంలో ఆశావహ జిల్లాలు పురోగతి సాధించాయని ప్రధాని పేర్కొన్నారు. వెనుకబడి వున్న ప్రాంతాలను గుర్తించి వాటిపై కేంద్రీకరించి పని చేయడంలో కేంద్రం, రాష్ట్రాలు, ప్రభుత్వ యంత్రాంగం కలసి కట్టుగా కృషి చేయాలన్నారు. ప్రధాని తన ముగింపు పలుకుల్లో బాగా వెనుకబడిన 122 జిల్లాలను పైకి తీసుకురావడంలో ఆశావహ జిల్లాల పథకం విజయవంతమైందని సెలవిచ్చారు. ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు వచ్చే మూడు నెలల్లో పది కర్తవ్యాలను నిర్దేశించుకోవాలని, దీంతోబాటే అజాదీకా అమృత మహౌత్సవ్కు సంబంధించిన అయిదు కర్తవ్యాలు ఉండాలని ప్రధాని కోరారు. డిజిటల్ ఇండియా సాధించడంతో భారత్ నిశ్శబ్ద విప్లవం సాధించిందన్నారు. గడచిన నాలుగేళ్లలో జన్ ధన్ ఖాతాలు నాలుగు నుంచి ఐదు రెట్లు పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వెనుకబడిన జిల్లాలతో బాటు మన రాష్ట్రం నుంచి విజయనగరం, విశాఖపట్నం, కడప జిల్లాలు పాల్గొన్నాయి.