Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫోన్‌కు సమాచారం
- యూపీలో ఆరోగ్య అధికారుల లీలలు!
లక్నో : మరణించిన వ్యక్తికి రెండవ టీకా వేసినట్టు ఫోన్లో సందేశం రావడంతో ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రవీణ్ సింగ్ నివ్వెరపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని మవు జిల్లాకి చెందిన ప్రవీణ్ సింగ్ ఫోన్‌కు ఈనెల 19న ఆరోగ్య శాఖ నుండి ఒక మెసేజ్ వచ్చింది. అందులో తన తండ్రి కైలాస్నాథ్ సింగ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకున్నట్లు సమాచారం వుంది. హృదయ సంబంధ వ్యాధితో సింగ్ తండ్రి కైలాస్నాథ్ 9మాసాల క్రితమే ఏప్రిల్ 29న మరణించారు.
అప్పటికి ఆయన మార్చి 15న ఒక డోసు మాత్రమే వేయించుకున్నారు. తాజాగా వచ్చిన మెసేజ్‌లో ఫుల్లీ 'వ్యాక్సినేటెడ్' అని వచ్చింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోమని కూడా వుంది. పైగా మధుబన్‌లో న్యూ ప్రైమరీ హెల్త్ సెంటర్లో నర్సు మీరాదేవి ఆయనకు వ్యాక్సిన్ వేసినట్లు సమాచారం అందించారు. జనవరి 19న సాయంత్రం 5.39గంటలకు సెకండ్ డోస్ వేసుకున్నట్టు వుంది. వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు ఆడుతున్న గేమ్ ఇదని సింగ్ విమర్శించారు. దీనిపై మవు వ్యాక్సినేషన్ ఇన్చార్జి డాక్టర్ బి.కె.యాదవ్‌ను ప్రశ్నించగా, ఇది పొరపాటా లేక ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఏ పరిస్థితుల్లో ఇలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. బహుశా ఫోన్ నెంబరు తప్పుగా ఇవ్వడం వల్ల ఇలా జరగడానికి ఆస్కారం వుంటుందన్నారు. పైగా వ్యాక్సినేషన్ సిబ్బంది సరిగా చూసుకోకపోవడం కూడా కారణమై వుండవచ్చన్నారు.