Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్‌లో నలుగురు చిన్నారులకు గాయాలు
- మామిడితోటలో పిల్లలు ఆడుకుంటుంటే..
పాట్నా: మంత్రి ఇంటి సమీపంలో ఉన్న మామిడి తోటలో పిల్లలతో పాటు కొందరు యువకులు చేరి క్రికెట్ ఆడటం తీవ్ర ఘర్షణకు దారితీసింది. మంత్రి కుమారుడు సిబ్బందితో కలిసి వారిపై దాడికి దిగాడు. అనంతరం తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా హర్దియా గ్రామంలో బీజేపీ నేత, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి నారాయణ ప్రసాద్ ఇల్లు ఉంది. ఆ పక్కనే ఉన్న మామిడి తోటలో ఆదివారం కొందరు పిల్లలు చేరి ఆడుకుంటున్నారు. అయితే.. అక్కడ ఆడకూడదనీ, తక్షణమే వెళ్లిపోవాలని మంత్రి కుమారుడు బబ్లూ ప్రసాద్‌తోపాటు అతడి ఇంటి సిబ్బంది పిల్లలను మొదట హెచ్చరించారు. ఇందుకు వారు నిరాకరించగా.. కొందరు పెద్దలు కూడా వారికి తోడయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
అక్కడినుంచి వెళ్లిపోయిన బబ్లూ.. అనంతరం నాలుగు వాహనాల్లో తన అనుచరులను తీసుకువచ్చి వారిపై దాడికి దిగారు. ఆవేశంతో ఊగిపోయిన బబ్లూ ప్రసాద్.. తన వద్ద ఉన్న తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. అనుచరులు జరిపిన దాడిలో నలుగురు పిల్లలు గాయపడ్డారు. దాడి, కాల్పుల గురించి తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. అంతా కలిసి మంత్రి ఇంటిపైకి దండెత్తారు. మంత్రి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈలోగా బబ్లూ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మంత్రి ఇంటి నుంచి ఒక పిస్టల్‌ను, ఒక రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇంతవరకు మంత్రి కుమారుడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితులు పేర్కొన్నారు. అయితే తన భూమిని గ్రామస్థులు ఆక్రమించుకునేందుకు యత్నించారని మంత్రి నారాయణ ప్రసాద్ ఆరోపించారు. గ్రామస్థులే మొదట తన కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారని అన్నారు. ఆ తర్వాత తన కుమారుడు లైసెన్స్ కలిగిన తుపాకీతో అక్కడికి వెళ్లాడని, అతడిపైనా గ్రామస్థులు రాళ్లతో దాడి చేసి, తెలిపారు. తన వాహనాన్ని కూడా ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు.