Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ ఐదు రాష్ట్రాలే లక్ష్యంగా హామీల మోత
- ముఖ్యంగా యూపీపై కేంద్రం గురి
- ఇటు కరోనాతోనూ మారనున్న లెక్కలు : ఆర్థిక నిపుణుల అంచనా
న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం రెండు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతున్నది. ఇందులో ఒకటి.. ఒమిక్రాన్ కరోనా వైరస్ విజృంభణ. రెండోది.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు అంశాలు దేశంలోని ప్రజలపై ప్రత్యక్షంగానూ, పరోక్షం గానూ ప్రభావం చూపుతున్నాయి. అంతేకాదు, ఇవి త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైనా ప్రభావం చూపనున్నాయని ఆర్థిక నిపుణులు తెలిపారు. అయితే, ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ బడ్జెట్లో మోడీ ప్రభుత్వం కేటాయింపులు, హామీలు ఇవ్వనున్నదని వివరించారు.
1న బడ్జెట్.. 10 నుంచి ఎన్నికల పోరు
ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ నాలుగోసారి పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 10 నుంచే యూపీతో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం ప్రారంభం కానున్నది. అంటే దాదాపు 10 రోజుల ముందు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. అయితే, వీటిలో పంజాబ్ (కాంగ్రెస్ పాలిత రాష్ట్రం) తప్ప మిగతా నాలుగు రాష్ట్రాలూ బీజేపీ పాలిత రాష్ట్రాలే. దీంతో ఈ ఎన్నికలు అధికార బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే అతిపెద్ద రాష్ట్రమైన యూపీ బీజేపీతో పాటు అన్ని పార్టీలకూ కీలకమే. దీంతో, ఐదు రాష్ట్రాల ఎన్నికలు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై ప్రభావం చూపనున్నాయని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా మోడీ సర్కారు ముందుకెళ్లే అవకాశం ఉన్నదని చెప్పారు.
యూపీలోని గ్రామీణ ఓటర్లే లక్ష్యంగా..
ఈ ఐదు రాష్ట్రాలలో యూపీ పైనే కేంద్రం దృష్టిని పెట్టిందని నిపుణులు చెప్పారు. యూపీలో 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ రాష్ట్ర పరిస్థితులే లక్ష్యంగా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. జైట్లీ ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్‌ను పరిశీలిస్తే.. గ్రామీణ ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు, పేదరిక నిర్మూలనపై ఎక్కువ దృష్టి పెట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు ఆయన (జైట్లీ) తెలిపారు. ముఖ్యంగా, ఆ సమయంలో ఐదు రాష్ట్రాల ఓటర్లను ఆకర్షించడానికి బడ్జెట్లో మార్పులు, చేర్పులు చేశారు. 2019 నాటికి నిరాశ్రయులకు కోటి ఇండ్లు కట్టిస్తామని జైట్లీ హామీ ఇచ్చారు. స్టాండప్ ఇండియా స్కీమ్‌ను ప్రోత్సహించడానికి ప్రాధాన్యతనిచ్చారు.
జైట్లీ బాటలో నిర్మల..!?
ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే పునరావృతమవుతాయనీ, బడ్జెట్లో జైట్లీ దారిని నిర్మలా సీతారామన్ అనుసరించే అవకాశాలున్నాయని నిపుణులు చెప్పారు. ముఖ్యంగా, గ్రామీన ప్రాంతాల ప్రజలే లక్ష్యంగా కేటాయింపులు ఉండనున్నాయనీ, ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వీలుగా కొన్ని పథకాలనూ ప్రకటించే అవకాశమున్నదని తెలిపారు. జైట్లీ బడ్జెట్ లాగే మూలధన వ్యయాన్ని పెంచడంపై ఆర్థిక మంత్రి దృష్టి పెట్టొచ్చని వివరించారు. పలు హామీలు కురిపించే అవకాశమున్నదన్నారు. ''యూపీలో బీజేపీ అధికారంలో ఉన్నది. ఇక్కడ జనాభాలో అధికం గ్రామీణులే. దీంతో వీరిని ఆకర్షించడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ ఉంటుంది'' అని నిపుణులు అన్నారు.
కేంద్ర పథకాలతో ఓటర్లను ఆకర్షించే యత్నం
కొన్ని జాతీయ పథకాల ద్వారా యూపీ ప్రజలను ఆకర్షించడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని ఆర్థికవేత్త ప్రణవ్సేన్ అంచనా వేశారు. '' ఈసారి కేంద్రం ఉద్యోగాల కల్పనపై ఎక్కువగా దృష్టి పెట్టొచ్చు. జైట్లీ బడ్జెట్‌ను పోలి ఉండే అవకాశమున్నది'' అని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కీ మజుందార్ అన్నారు. కాగా, ఈ ఐదు రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
ఒమిక్రాన్ ఎఫెక్ట్
ఇక కరోనా మహమ్మారి పరిస్థితులూ బడ్జెట్ రూపురేఖలను మార్చే అవకాశమున్నదని నిపుణులు తెలిపారు.దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభన కొనసాగుతున్నది. కేసులు అంతకంతకూ వ్యాపిస్తున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా పరిమిత ప్రభావాన్ని చూపుతుందని నిటి ఆయోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్ కుమార్ తెలిపారు. 2021-22లో జీడీపీ వృద్ధి 9 నుంచి 9.2 శాతం వరకు ఉండొచ్చని ఆయన అన్నారు.