Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరుపులు మాత్రం కొన్నే : రఘురామ్ రాజన్
- తీవ్ర స్థాయిలో నిరుద్యోగం, పడిపోతున్న ప్రజల కొనుగోలు శక్తి
- మధ్య తరగతి, చిన్న వ్యాపారాలపై కోవిడ్ ప్రభావం
- పెద్ద పెద్ద కంపెనీలే ఆర్థికంగా బాగున్నాయి..
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌కు కసరత్తు మొదలవుతు న్నవేళ ఆర్బీఐ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థలో మెరుపులు కొన్నే ఉన్నాయని, మరకలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. భారీ ద్రవ్యలోటు ఏర్పడకుండా చాలా జాగ్రత్తగా ఖర్చు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కె-ఆకృతిలో కోలుకోకుండా అడ్డుకోవాలన్నారు. ఇందు కోసం ప్రభుత్వం చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. రఘురామ్ రాజన్ ప్రస్తుతం చికాగో విశ్వవిద్యాల యం బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆది వారం ఆయన ఓ వార్తా సంస్థతో ఈ-మెయిల్ ద్వారా జరిపిన ఇంటర్వ్యూలో పై విషయాలు చెప్పారు.
మధ్య తరగతికి పెద్ద దెబ్బ
భారత ఆర్థిక వ్యవస్థ మధ్య తరగతిని, చిన్న పిల్లల్ని, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాల్ని అతలాకుతలం చేస్తోంది. ఇది నన్ను తీవ్రంగా భయపెడుతున్న అంశం. ఆర్థిక వ్యవస్థలో ఈ పరిస్థితి 'పెంట్ అప్' డిమాండ్‌కు దారితీస్తుంది. ఈ తరహా డిమాండ్‌లో ఉండే ముఖ్య లక్షణం బలహీనమైన వృద్ధి, సామూహిక వస్తు వినియోగం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాలు, పరిశ్రమలపై కోవిడ్ మహమ్మారి చెప్పుకోదగిన స్థాయిలో ప్రభావితం చూపింది. అయితే ఈ సంక్షోభం నుంచి ఆర్థికవ్యవస్థ కోలుకునే క్రమంలో దెబ్బతిన్న రంగాలుకాకుండా, టెక్నాలజీ, భారీ స్థాయిలో ఉండే ఆర్థిక సంస్థలు చాలా వేగంగా వృద్ధి చెందితే దానిని కె-ఆకృతిలో రికవరీ అంటారు. ఇలాంటి రికవరీ పేదలు, మధ్య తరగతిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు.
మెరుపులు..
మెరుపులను వివరిస్తూ...ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో పెద్ద పెద్ద కంపెనీలు ఆర్థికంగా బాగున్నాయి. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల వ్యాపారం బాగా సాగుతోంది. కొత్త కొత్త వ్యాపార సంస్థలు వస్తున్నాయి. ఆర్థికరంగంలో కొన్ని విభాగాలు పటిష్టంగా ఉన్నాయి.
మరకలు..
నిరుద్యోగం తీవ్రత, తక్కువ కొనుగోలు శక్తి, దిగువ మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి అతి తక్కువగా ఉండటం, చిన్న తరహా, మధ్య తరహా సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లు, అతి తక్కువ క్రెడిట్ గ్రోత్, విద్యారంగం దయనీయ పరిస్థితులు వంటివి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మరకలు. కరోనా వైరస్ రూపాంతరం ఒమైక్రాన్ వల్ల వైద్యపరంగానూ, ఆర్థికంగానూ ఎదురుదెబ్బ తగిలిందన్నారు. కె-ఆకృతిలో ఆర్థిక వ్యవస్థ కోలుకునే అవకాశంపై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిని నిరోధించేందుకు ఇంకా చాలా చేయవలసిన అవసరం ఉందన్నారు.
జాగ్రత్తగా ఖర్చు చేయాలి..
ఎక్కడైతే అవసరమో అక్కడ ఖర్చు చేయాలి. చాలా జాగ్రత్తగా లక్ష్యాల్ని ఎంచుకోవాలి. పరిశ్రమల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటీవ్ పథకాన్ని తీసుకొస్తే బాగుంటుంది. భారీ ద్రవ్యలోటుతో ముందుకెళ్లలేం. 5, 10ఏండ్ల ప్రణాళికతో భారత్ ముందుకెళితే బాగుంటుందని అనుకుంటున్నా. ఈ ప్రణాళికలు అమలుజేయడానికి సరైన ఏర్పాట్లు చేసుకోవాలి.