Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో సామూహిక వ్యాప్తి దశకు చేరుకుందని వైరస్ల జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్సార్షియం ప్రకటిం చింది. ఇప్పటివరకూ ఒమిక్రాన్ కేసులు తేలికపాటిగా ఉన్నప్పటికీ ప్రస్తుత వేవ్‌లో ఆసుపత్రుల్లో చేరడంతోపాటు ఐసియు కేసులు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయని ఇండియన్ సార్స్ సిఒవి-2 జినోమిక్స్ కన్సార్టియమ్ (ఐఎన్ఎస్ఎసిఒజి) ఆదివారం వెల్లడించింది. మల్టీపుల్ మెట్రో నగరాల్లో కోవిడ్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొంది. మన దేశంలో బిఎ.2 లైనేజ్ భిన్నంగా ఉందని, ఎస్ జీన్ డ్రాపౌట్ బేస్డ్ స్క్రీనింగ్ హై ఫాల్స్ నెగెటివ్స్‌ను అందించే అవకాశముందని ఆ కన్సార్టియం తెలిపింది. ఎస్ జీన్ డ్రాపౌట్ ఒమిక్రాన్ మాదిరిగానే జన్యువైవిద్యం.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డిబిటి) సంయుక్తంగా ఐఎన్ఎస్ఎసిఒజిని ప్రారంభించాయి. జన్యువైవిద్యాల పర్యవేక్షణకు ఇది 38 ప్రయోగశాలల కన్సార్టియం. ఢిల్లీ, ముంబయి వంటి మెట్రో నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దానికన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లు అంచనా వేసింది.
'ఒమిక్రాన్ వేరియంట్ సోకినా ప్రస్తుతం చాలా మందిలో వైరస్ లక్షణాలు కనిపించడం లేదు. ఒక వేళ బయటపడినా అవి స్వల్ప స్థాయిలోనే ఉన్నాయి. వ్యాక్సిన్ పొందిన ప్రయాణికుల్లో మొదట ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు, హైరిస్కు ఉన్న వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలి. కమ్యూనిటీ వ్యాప్తితో పరిస్థితి తీవ్రమవుతోంది. దీంతో మరింత జాగ్రత్తగా ఉండాలి' అని హెచ్చరించారు. అయినప్పటికీ, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువేనని, ప్రాణాపాయ ముప్పు కూడా స్వల్పమేనని పేర్కొంది. ఒమిక్రాన్‌ను నిర్లక్ష్యం చేయడం తగదని, తగు రక్షణ విధానాలను పాటించాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ కన్సార్టియం ద్వారా ఇప్పటివరకు 1,50,710 శాం పిల్స్ సీక్వెన్స్ చేశారు. 1,27,697 శాంపిల్స్‌ను విశ్లేషించారు.