Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గరీబోళ్ల వార్షిక కుటుంబ ఆదాయంలో 53శాతం తగ్గుదల
- అత్యంత ధనికుల ఆదాయం 39శాతం పెరుగుదల
- పట్టణ పేదలపై కోవిడ్, లాక్డౌన్ దెబ్బ : తాజా సర్వే వెల్లడి
దేశంలో ఉన్నోడు..లేనోడికి మధ్య ఆర్థిక అసమానతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. 1995నాటితో పోల్చితే నేడు రెండు రకాల భారత్ కనపడుతోంది. దేశంలో 2015 నుంచి ధనిక వర్గం ఆదాయాలు భారీగా పెరుగుతు న్నాయి. మరోవైపు ఎగువ మధ్య తరగతి..దిగువ మధ్య తరగతిలోకి, పేదలు మరింత పేదరికంలోకి కూరుకు పోతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో పేద కుటుంబాల ఆదాయాలు పడిపోతున్నాయి. అత్యంత దిగువన ఉన్న పేద కుటుంబాల వార్షిక ఆదాయం 53శాతం పడిపోయింది.
- ఐసీఈ360 సర్వే 2021
న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక అసమానతలు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాల ఆదాయం గణనీ యంగా పడిపోతోంది. ఇదంతా కోవిడ్ సంక్షోభం, లాక్డౌన్ రాకముందే మొదలైందని, సంక్షోభం తర్వాత ఆదాయాలు పడిపోవటం వేగవంతం అయ్యాయని తాజా సర్వే ఒకటి తేల్చింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ పీపుల్స్ రిసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకానమీ( 'ప్రైస్') దేశవ్యాప్తంగా 2లక్షల కుటుంబా లపై అధ్యయనం చేసింది. ఆదాయం పరంగా దేశ ప్రజల్ని 5 కేటగిరీలుగా విభజించి..వివరాలు సేకరించారు. ఇందులో అత్యంత దిగువన ఉన్న 20శాతం పేద కుటుంబాల వార్షిక ఆదాయం గణనీయంగా దెబ్బతిన్నది. 2015-2021 మధ్య వార్షిక ఆదాయం 53శాతం వరకు తగ్గిందని నివేదిక తెలింది. 100 జిల్లాల్లో 120 పట్టణాలు, 800 గ్రామాల్లో తమ అధ్యయనం సాగిందని సంస్థ తెలిపింది. 'ఐసీఈ360 సర్వే 2021' పేరుతో రూపొందించిన నివేదికలో కీలక అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
పట్టణాల్లో మరింతగా
గ్రామీణ పేదలతో పోల్చితే పట్టణ పేదల్లో ఎక్కువగా ఆదాయం దెబ్బతిన్నది. కరోనా మొదటి వేవ్, లాక్డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలన్నీ ఒక్కసారిగా ఆగిపోవటం, ఉపాధి కోల్పోవటం పట్టణ పేదలపై తీవ్ర ప్రభావం చూపింది. దినసరి కూలీలు, వీధి వ్యాపారులు, గృహసంబంధ పనులు చేసే కార్మికులు ఎక్కువగా నష్టపోయారు. 2016 తర్వాత పేదల సంఖ్య పట్టణాల్లో పెరిగింది. దిగువన ఉన్న 20శాతం పేద కుటుంబాల వార్షిక ఆదాయం 1995 తర్వాత పెరుగుతూ రాగా, 2016 నుంచి పడిపోవటం మొదలైంది. వార్షిక ఆదాయం 2016లో 5.9శాతం పడిపోగా, 2021లో 3.3శాతం క్షీణించింది.
ధనికులు పైపైకి..
దేశంలో ధనికులు, అత్యంత ధనికులైన 20శాతం కుటుంబాల వార్షిక ఆదాయ వివరాల్ని 'ప్రైస్' సేకరించింది. ఈ వర్గం కుటుంబాల వార్షిక ఆదాయం గత ఐదేండ్లలో 39శాతం పెరిగింది. వీరి కుటుంబ ఆదాయాలు 1995నాటితో పోల్చుకుంటే 50శాతం నుంచి 56.3శాతానికి (2021లో) చేరుకుంది. దిగువ మధ్య తరగతి కుటుంబాల ఆదాయం 32శాతం పడిపోగా, ధనిక వర్గానికి చెందిన 20శాతం కుటుంబాల ఆదాయంలో 7శాతం పెరుగుదల నమోదైంది.
అంతరాలు తగ్గించే విధానాలు రావాలి : రాజేశ్ శుక్లా, ఎండీ, సీఈవో, ప్రైస్
టైర్-1, టైర్-2 నగరాల్లో దినసరి కూలీలు, చిన్న వ్యాపారులు, ఇండ్లల్లో పనిచేసే కార్మికులపై కోవిడ్ సంక్షోభం ప్రభావం ఎక్కువగా ఉంది. పట్టణల్లో ఆదాయా లు దెబ్బతిని ఎగువ మధ్య తరగతి...దిగువ మధ్య తరగతి స్థాయికి పడిపోయింది. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకొని రాబోయే 2022-23 కేంద్ర బడ్జెట్లో సరైన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం. దేశంలో రెండు వేరు వేరు భారత్‌లు కనపడుతున్నాయి. వీరి మధ్య అంతరాలు తగ్గించే ఆర్థిక విధానాలు ఎంచుకోవాలి.
బడా కంపెనీలకు ప్రభుత్వ సాయం అవసరం లేదు : రమా బిజాపూర్కర్, ఫౌండర్, ప్రైస్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో వ్యాపార వర్గాల్లో నమ్మకాన్ని పెంచే చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలు. ఇందు కోసం సుదీర్ఘమైన స్థిరమైన ప్రణాళికలు ఎంచుకోవాలి. బడా వ్యాపార సంస్థలు, కార్పొరేట్ సంస్థలు లాభాలు పోగేసుకున్నాయి. వీటికి ప్రభుత్వ సహకారం, సాయం అవసరం లేదు. దేశంలో అత్యంత పేదరికంలో కూరుకుపోయిన వర్గాల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి.