Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దలాల్ స్ట్రీట్‌లో కన్నీరు
- ఒక్క పూటలో రూ.10 లక్షల కోట్లు ఆవిరి
- సెన్సెక్స్ 1546 పాయింట్ల పతనం
- ఐదు సెషన్లలో రూ.20 లక్షల కోట్లు ఫట్
ముంబయి : దలాల్ స్ట్రీట్‌లో బేర్ పట్టుతో కన్నీరు కొనసాగుతోంది. పలు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో సెషన్లోనూ భారీ నష్టాలు చవి చూశాయి. లక్షల కోట్ల సంపద తుడుచుకు పెట్టుకుపోవడంతో మదుపర్లు లబోదిబోమంటున్నారు. సోమవారం ఒక్క సెషన్లోనే అమ్మకాల ఒత్తిడితో రూ.9.5 లక్షల కోట్ల సంపద అవిరయ్యింది. కనీసం కొనుగోలు చేసే వారు దిక్కు లేక వందలాది కంపెనీల షేర్లు విలవిలలాడాయి. సెన్సెక్స్ ఏకంగా 1,545.67 పాయింట్లు లేదా 2.62 శాతం పతనమై 57,491.51కి క్షీణించింది. ఇంట్రాడేలో ఏకంగా 2వేల పాయింట్లు పతనమైంది. ఇదే బాటలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 468 పాయింట్లు పడిపోయి 17,149కి పరిమితమయ్యింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు రోజంత నెత్తురోడుతూనే ఉన్నాయి. ఏ దశలోనూ ప్రతికూలతల నుంచి బయటపడే సంకేతాలు కానరాలేదు. చిన్నా, పెద్ద షేర్లు అని తేడా లేకుండా దాదాపు అన్నీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐదు సెషన్లలో సెన్సెక్స్ 3,820 పాయింట్లు, నిఫ్టీ 1,189 పాయింట్ల చొప్పున క్షీణించాయి. ఈ కాలంలో బిఎస్ఇ మార్కెట్ కాపిటలైజేషన్ ఏకంగా 19.5 లక్షల కోట్లు పతనమై రూ.260.48 లక్షల కోట్ల వద్ద ముగిసింది. దీంతో ఈ మొత్తం మదుపర్లు నష్టపోయినట్లయ్యింది.
ప్రధాన కారణాలు..
ఉక్రెయిన్-రష్యా మధ్య సరిహద్దు వివాదం పెరగడం అన్ని దేశాల మార్కెట్లకు ఆశనిపాతంలా మారింది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలను సరఫరా చేయడం తీవ్ర ఆందోళనను పెంచింది. ఈ ఉద్రిక్తతలకు తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనుందన్న సంకేతాలు ప్రపంచ మార్కెట్లను కుదేలు చేశాయి. జనవరి 25, 26న రెండు రోజుల పాటు అమెరికా ఫెడ్ సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభించడం ఆందోళనలను పెంచింది. ఇటీవల రోజుకు మూడు లక్షల పైగా కేసులు నమోదు కావడం ప్రతికూలతలకు దారి తీసింది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సానుకూల సంకేతాలు కానరాకపోవడం మదుపర్లను ఆందోళనకు గురి చేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.
అన్నీ నేల చూపులే..!
అన్ని రంగాల సూచీలు నేల చూపులు చూశాయి. నిఫ్టీలో రియాల్టీ అత్యధికంగా 6 శాతం క్షీణించగా, లోహ సూచీ 5.2 శాతం, ఐటి 3.4 శాతం చొప్పున పతనమయ్యాయి. బిఎస్ఇలోని దాదాపు 3000 సూచీలు నష్టాలు చవి చూశాయి. 518 స్టాక్స్ మాత్రమే స్వల్ప లాభాలను నమోదు చేశాయి. 875 స్టాక్స్ ఏకంగా లోయర్ సర్య్కూట్ను తాకాయి. ఈ షేర్లను కనీసం కొనుగోలు చేసే వారు లేకుండా పోయారంటే పరిస్థితి తీవ్రత స్పష్టమవుతుందని నిపుణులు పేర్కొన్నారు.