Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూర్చున్న కొమ్మను నరుక్కోవటమే : పీపుల్స్ కమిషన్
న్యూఢిల్లీ : కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు ఎస్.పి.శుక్లా, జేఎన్యూ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సి.పి.చంద్రశేఖర్, ప్రఖాత్య ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ సహా 11మంది సభ్యులతో కూడిన 'పీపుల్స్ కమిషన్' ఎల్ఐసీ ఐపీఓ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. బడ్జెట్ లోటును పూడ్చుకోవ టానికి ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయటం దివాళాకోరుతనమని విమర్శించింది. వాటాల ఉపసంహరణ ద్వారా ఎల్ఐసీని నిర్వీర్యం చేస్తే, సంస్థ అవలంభిస్తున్న సామాజిక పంథా దెబ్బతింటుందని హెచ్చరించింది. కేవలం లాభాపేక్ష కోసమే పనిచేయవలసి వస్తుందని తెలిపింది. దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్ఐసీ ఐపీవోను ఉపసంహరించుకోవాలని 'పీపుల్స్ కమిషన్' మోడీ సర్కార్ను డిమాండ్ చేస్తోంది. 'పీపుల్స్ కమిషన్' మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఎల్ఐసీలో వాటాల ఉపసంహరణ కోసం కేంద్రం చట్టాన్ని సవరించింది. తాను ఇన్నాండ్లు తీసుకుంటున్న డివిడెండ్ 5శాతాన్ని 10శాతానికి ఏకపక్షంగా పెంచుకుంది. ఈరకమైన సవరణ కేవలం రాబోయే వాటాదారుల కోసమే చేశారు. ఎల్ఐసీలో వాటాల అమ్మకం దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. బీమారంగం ప్రయివేటీకరణ 20ఏండ్లు పూర్తిచేసుకున్న ఈ సందర్భంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఐసీ మాత్రమే ఉంది. ప్రయివేటు బీమా కంపెనీలు పట్టణాలకే పరిమితం అయ్యాయి. అత్యంత తక్కువ ప్రీమియంలతో ఎల్ఐసీ మైక్రో ఇన్సూరెన్స్ అందిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వాలకు ఎల్ఐసీ తన నిధులు అందజేస్తోంది. దేశానికి బంగారు బాతులాంటి ఈ సంస్థను అమ్ముకోవటం, తాను కూర్చున్న కొమ్మను నరుక్కోవటం వంటిదే.