Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ప్రతిపాదనలపై విజయన్, స్టాలిన్ అభ్యంతరం
- ప్రధానికి లేఖలు రాసిన సీఎంలు
న్యూఢిల్లీ : ఐఏఎస్ క్యాడర్ రూల్స్, 1954ను మార్చాలన్న కేంద్ర ప్రతిపాదనలపై దేశంలోని అనేక రాష్ట్రాలు తమ వ్యతిరేకతను తెలుపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు ప్రతిపాదిత డిప్యూటేషన్ రూల్స్‌పై మోడీ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇప్పుడు ఆ జాబితాలో కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్లు చేరారు. కేంద్రం నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీకి లేఖలు రాశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం కేంద్ర ప్రతిపాదనలు సమాఖ్య స్ఫూర్తినీ, రాష్ట్ర స్వయంప్రతిపత్తి మూలాన్నీ దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్రాలు ఐఏఎస్ అధికారుల సేవలు అవసరమవుతాయనీ, ఇది రాష్ట్రాల పరిపాలనాపై పడుతుందని వివరించారు. డిప్యూటేషన్ కోరుకునే అధికారుల నైతికతను కేంద్రం తీరు ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. ప్రధానికి రాసిన లేఖను ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఈ అంశంపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీసగఢ్ సీఎం భూపేశ్ భఘేల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లు ఇప్పటికే ప్రధానికి లేఖలు రాసిన విషయం విదితమే. నిబంధనల మార్పుతో రాష్ట్ర పరిపాలన చిక్కుల్లో పడుతుందన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పు నిర్ణయాన్ని విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ : విజయన్
ఐఏఎస్ డిప్యూటేషన్ విషయంలో కేంద్ర ప్రతిపాదించిన మార్పులు సహకార సమాఖ్య విధానం పునాదులను బలహీనం చేస్తాయని కేరళ సీఎం విజరు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖలో ఆయన పలు అభ్యంతరాలను, అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇవి కేంద్రానికి చాలా అనుకూలమని వివరించారు. ఆలిండియా సర్వీసెస్ డిప్యూటేషన్ రూల్స్‌లో ప్రతిపాదిత సవరణలు.. కేంద్రంలో ఉండే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయడంలో అఖిల భారత సర్వీసు అధికారులలో భయాందోళనలు, సంకోచ వైఖరిని ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు. '' కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజల చేత ఎన్నుకోబడినందున సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఉన్నాయి. అయినప్పటికీ, రాజ్యాంగంలోని అధికార విభజన విస్తృత శ్రేణి విషయాలపై యూనియన్ అధికార పరిధిని ఇస్తుంది'' అని విజయన్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నియమావళికి లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన కొనసాగేలా చూడాలని కోరారు.