Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భర్తే అపరాధి.. దేశంలో బాధిత మహిళలు 4శాతం
- కర్నాటక, బీహార్, ప.బెంగాల్, అసోంలలో అత్యధికం
న్యూఢిల్లీ : భర్త తమపై లైంగిక హింసకు పాల్పడుతున్నాడు..రక్షణ కల్పించండి..అని పోలీసులను ఆశ్రయిస్తున్న మహిళల సంఖ్య దేశంలో పెరుగుతోంది. ప్రతి 25 మంది మహిళల్లో ఒకరు తమ భర్త నుంచి పలుమార్లు లైంగిక హింసకు గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5(ఎన్ఎఫ్హెచ్ఎస్) 2019-21 గణాంకాల్లో పై వివరాలు నమోదయ్యాయి. వివిధ రకాల లైంగిక దాడులు, హింసకు సంబంధించిన సమాచారాన్ని వివాహం చేసుకున్న 18-49ఏండ్ల మహిళల నుంచి సేకరించి సర్వేలో పొందుపర్చారు. భర్త నుంచి లైంగిక హింసను ఎదుర్కొంటున్న భార్యల వివరాల్ని కూడా సర్వే సేకరించింది. ఈ గణాంకాల ఆధారంగా దేశంలో 4శాతం మంది మహిళలు తమ భర్తల నుంచి లైంగిక హింసను ఎదుర్కొన్నారని లెక్క తేలింది. అత్యధికంగా కర్నాటకలో 9.7శాతం నమోదైంది. అంటే...ప్రతి 10మంది మహిళల్లో ఒకరు తమ భర్త నుంచి లైంగిక హింసను ఎదుర్కొంటున్నారని విశ్లేషకులు చెప్పారు.
భర్తే లైంగిక హింసకు పాల్పడుతున్నాడని పోలీస్ స్టేషన్ను భార్య ఆశ్రయిస్తే, అక్కడ పోలీసులు ఫిర్యాదు స్వీకరిచటం లేదు. భారతీయ చట్టాలు కూడా దీనిని నేరంగా పరిగణించటం లేదు. దీనిని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కర్నాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో లైంగిక హింస ఫిర్యాదులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయని, దీనిని నేరంగా పరిగణించాలని పలువురు హక్కుల కార్యకర్తలు న్యాయస్థానాన్ని కోరుతున్నారు. ఎన్ఎఫ్హెచ్ఎస్-5 సర్వే దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో నిర్వహించారు. తరుచుగా, పలుమార్లు భర్త నుంచి లైంగిక హింసను ఎదుర్కొన్నామని సర్వేలో దాదాపు 4శాతం మంది మహిళలు చెప్పారు. రాష్ట్రాల వారీగా చూస్తే కర్నాటకలో 9.7శాతం, బీహార్లో 7.1శాతం, పశ్చిమ బెంగాల్లో 6.8శాతం, అసోంలో 6.1శాతం లైంగిక హింస నమోదైంది. ఎన్ఎఫ్హెచ్ఎస్-4 (2015-16) సర్వేతో పోల్చితే కర్నాటకలో లైంగిక హింస 6.3శాతం నుంచి 9.7శాతానికి పెరిగింది.