Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు తొలగిపోతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందురోజు ఆయన జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలో కోవిడ్ ఇన్ఫెక్షన్ రేటు ఈరోజు 10 శాతానికి చేరింది. జనవరి 15 నాటికి 30 శాతంగా ఉంది. ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉండటంవల్లే ఆంక్షలు విధించాం. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుతున్నందున త్వరలోనే కోవిడ్ ఆంక్షల్ని ఎత్తివేసి సాధారణ స్థితికి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే ఢిల్లీలో వంద శాతం మంది ప్రజలు మొదటి డోసు టీకా తీసుకున్నారనీ, 82 శాతం మంది ప్రజలైతే.. రెండు మోతాదుల టీకా తీసుకోవడం వల్లే ఇన్ఫెక్షన్ రేటు తగ్గుతుందన్నారు. కరోనా పరిస్థితి కొంత మెరుగుపడిన తర్వాత రాబోయే రోజుల్లో వారాంతపు కర్ఫ్యూ నిబంధనను ఎత్తివేసే నిర్ణయం తీసుకోనున్నట్టు ఆయన చెప్పారు.
కాగా, ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 5,760 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం నమోదైన కరోనా కేసులు 9,197 కేసుల కంటే 37 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక క్రియాశీలత రేటు కూడా 13.3 శాతం నుంచి 11.79 శాతానికి పడిపోయింది.