Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత ఏడాదిలో 9 శాతమే వృద్థి
న్యూఢిల్లీ : భారత వృద్థి రేటు అంచనాలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ జీడీపీ పెరుగుదల 9 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. ఇంతక్రితం అక్టోబర్‌లో ఈ అంచనా 9.5 శాతంగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23లో 7.1 శాతం వృద్థి ఉండొచ్చని తెలిపింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించిన విషయం తెలిసిందే. 2021-22లో దేశ జీడీపీ 9.2 శాతం పెరుగొచ్చని కేంద్ర గణంకాల శాఖ అంచనా వేయగా, 9.5 శాతం పెరుగొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఎస్అండ్పీ 9.5 శాతం, మూడీస్ 9.3 శాతం, ప్రపంచ బ్యాంక్ 8.3 శాతం, ఫిచ్ 8.4 శాతం చొప్పున పెరుగొచ్చని అంచనా వేశాయి.
2023లో రుణాల జారీలో వృద్థి మెరుగ్గా ఉండొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది. 2022లో ప్రపంచ దేశాల జీడీపీ 5.9 పెరుగొచ్చని రుణాల వృద్థితో పాటు పెట్టుబడులు, వినిమయం, నిర్మాణ రంగాలు మెరుగైన ప్రగతిని కనబర్చే అవకాశం ఉందని తెలిపింది. అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థలు వృద్థికి ప్రధాన మద్దతును అందించనున్నాయని విశ్లేషించింది. 2023 ప్రపంచ వృద్థి రేటు తిరిగి 3.8 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది. కాగా.. వరుసగా మూడో ఏడాది కూడా ప్రపంచ దేశాల రికవరీకి అనేక సవాళ్లు నెలకొన్నాయని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ పేర్కొన్నారు. ఒమిక్రాన్ వైరస్ వేగంగా పెరగడం, కార్మికుల కొరత వృద్థికి ఆటంకాలుగా ఉన్నాయన్నారు. అధిక ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు డిమాండ్‌ను దెబ్బతీస్తున్నాయన్నారు.