Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ విద్యకు పెరుగుతున్న ప్రాధాన్యత
- వాస్తవికతలను ఆమోదించాల్సి వుందన్న అధ్యయనం
న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో ఇక విశ్వవిద్యాలయాలు కనుమరుగు కానున్నాయా? అంటే ఇక అవుననే చెప్పాలేమో ! రెండేళ్ళ క్రితం కోవిడ్ కల్లోలంతో ఆన్లైన్లో చదువుకోవడమనేది బాగా ప్రాముఖ్యత సంతరించుకుంది. తాత్కాలికంగా ప్రారంభమైన ఈ పద్ధతే భవిష్యత్తులో కొనసాగేలా కనిపిస్తోందని కొత్తగా విడుదలైన నివేదిక పేర్కొంది. ఉన్నత విద్యా రంగంలో సత్వరగతిన మారుతున్న ఈ మార్పులను గుర్తించాలని, ఒకవేళ కేంపస్లు తిరిగి ప్రారంభమైనా సాధారణ పరిస్థితులు నెలకొనేలా కనిపించనందున నేతలందరూ ఈ వాస్తవాన్ని ఆమోదించాల్సి వుందని ఆ నివేదిక పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో విశ్వవిద్యాలయాలు అనేక అస్తిత్వ సమస్యలను ఎదుర్కొంటున్నాయని ఆ నివేదిక పేర్కొంది. మొత్తంగా విశ్వవిద్యాలయాల భవితవ్యం ముప్పుకు గురవుతోందని, ఉన్నత విద్యా రంగంలో 'ఉచ్ఛ స్థితిని' ఈ దేశాలు ఎదుర్కొనవచ్చని నివేదిక పేర్కొంది. ''గతంలోని విశ్వవిద్యాలయాలకు ఇంకా భవితవ్యం వుందా?'' అనే శీర్షికతో కన్సల్టింగ్ సంస్థ ఇవై ఈ నివేదికను విడుదల చేసింది. భారత్, అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఆస్ట్రేలియాల్లోని విశ్వవిద్యాలయాల నేతలు 29మందిని ఇంటర్వ్యూ చేసి ఉన్నత విద్యా రంగం భవితవ్యంపై జరిపిన విశ్లేషణ ఆధారంగా ఈ నివేదికను ప్రచురించారు. భౌగోళిక, రాజకీయ సవాళ్ళు, ప్రజల్లో వచ్చిన మార్పులు, మారుతున్న పని ప్రదేశాల డిమాండ్లు, వాతావరణం, నాణ్యత గల డిజిటల్ అనుభవం కావాలని పెద్ద సంఖ్యలో విద్యార్ధులు ఆకాంక్షించడం కారణంగా కొత్తగా తలెత్తిన వాస్తవిక పరిస్థితులను విశ్వవిద్యాలయాలు కూడా సత్వరమే ఆమోదించాల్సిన అవసరం వుందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు ఇంకా కోవిడ్ మహమ్మరి నుండి కోలుకుంటున్నాయి. మీడియా, రిటైల్, ఇంధన రంగాల్లో ఇప్పటికే వ్యాపార పునర్నిర్మాణం జరుగుతోందని, అది ఇప్పుడు ఉన్నత విద్యా రంగానికి వేగంగా వస్తోందని నివేదిక పేర్కొంది. తమ ప్రయోజనమేమిటి, ఎలా తాము సేవలందించాలనే విషయమై వారు పునరాలోచించడానికి సుముఖంగా లేకపోతే కోవిడ్ విసిరిన ఈ సవాళ్ళలో కొన్ని అస్తిత్వ సమస్యలుగా మారిపోతాయని హెచ్చరించింది. క్లిష్టమైన ప్రశ్నలు వేస్తూ, యథాతథ స్థితిని సవాలు చేస్తూ, ఉన్నత విద్యను ఎవరికి, ఎలా అందించాలనే అంశంపై పునరాలోచించేందుకు కరోనా సృష్టించిన ప్రస్తుత అవకాశాల వైపు చూసే సమయం ఆసన్నమైందని ఆ నివేదిక సూచించింది. పోటీబరిలో వుండాలంటే వేగంగా మారుతూ వస్తున్న నిర్వహణా పద్దతులను ఎలా సముపార్జించుకోవాలో విశ్వవిద్యాలయాలు అవగాహన చేసుకోవాలని నివేదిక సిపార్సు చేసింది. అంతర్జాతీయ విద్యా దినోత్సవం రోజున ఈ నివేదికను ప్రచురించారు. ఉన్నత విద్యను కొత్త పద్ధతుల్లో, మార్గాల్లో అందుబాటులోకి తెచ్చుకునేందుకు వర్ధమాన దేశాలకు సాంకేతికత బాగా సాయపడుతోంది. విశ్వవిద్యాలయాలు కూడా తమ పరిధిని విస్తరించుకునేందుకు అనుమతిస్తోంది. పరిశోధన అనేది విశ్వవిద్యాలయాలకు జీవనాడి వంటిది, ఇది, ర్యాంకింగ్లను నిర్ణయించడం నుండి సమాజానికి విలువైన సేవలను అందించగల ఉత్తమ విద్యార్ధులను ఆకర్షించే వరకు ఉపయోగపడుతుంది. కానీ ఇది చాలా వ్యయంతో కూడినది, దాంతో ఆదాయాల కోసం ట్యూషన్ ఫీజులపై ఆధారపడాల్సి వుంటుంది. కానీ, విశ్వవిద్యాలయాలు గనుక వాణిజ్యపరమైన, డిమాండ్ కలిగిన పరిశోధనాంశాలకు ప్రాధాన్యతనివ్వగలిగి, పరిశ్రమలు, పెట్టుబడి మార్కెట్లతో చేతులు కలపాలని, ఆ తర్వాత దేశ లేదా అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన వాణిజ్యయేతర పరిశోధనలకు నిధుల కోసం ప్రభుత్వాలతో పనిచేయాలని నివేదిక సూచించింది.