Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశీ నర్సుల నియామకంతో పేద దేశాలపై ప్రభావం
- కరోనా ఆపత్కాలంలో ఆరోగ్య కార్యకర్తల కొరతతో ఇబ్బందులు
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో వణికిస్తున్నది. థర్డ్‌వేవ్ కోరలు చాస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నది. ఇలాంటి తరుణంలో పేద దేశాలను మానవతా హృదయంతో ఆదుకో వాల్సిన సంపన్న దేశాలు నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నాయి. కరోనా తొలి రెండు వేవ్‌లలో టీకాల విషయంలో సంపన్న దేశాలు పేద దేశాలపై కరుణ చూపలేదు. వ్యాక్సిన్లు సరిపడా లేకపోవడంతో పేద దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఫలితంగా ఈ దేశాల్లో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ సంపన్న దేశాలు పాత రోజులను గుర్తు చేస్తున్నాయి. పేద దేశాలను కనీసం పరిగణలోకి తీసుకోకుండా ధన బలంతో అక్కడి నర్సులను తమ దేశాలకు తీసుకెళ్తున్నాయి. ఆరోగ్య కార్యకర్తలను నియమించుకుంటూ నిర్దయగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ప్రస్తుత ఒమిక్రాన్ ఆపత్కాల సమయంలో పేద దేశాలు నర్సులు, ఆరోగ్య కార్యకర్తల కొరతను ఎదుర్కొంటున్నాయి. సంపన్న దేశాల తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకార్యకర్తలు, నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒమిక్రాన్ వేవ్‌తో ప్రపంచదేశాలు పేద ప్రాంతాల నుంచి నర్సుల నియామకాన్ని తీవ్రతరం చేశాయి. అయితే, ఇది అక్కడ (పేద ప్రాంతాలలో) విస్తరించిన శ్రామిక శక్తిలో భయంకరమైన కొరతను పెంచుతుందని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ తెలిపింది. అయితే, ఆరోగ్య అసమానతలను మరింత దిగజార్చుతున్న ధోరణిలో భాగంగా చాలా మంది అంతర్జాతీయ రిక్రూట్‌మెంట్‌ను పేద దేశాలు పెంచాయని 2.7 కోట్ల మంది నర్సులు, 130 జాతీయ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జెనీవా ఆధారిత గ్రూపు సీఈఓ హౌవార్డ్ కాటన్ అన్నారు. యూకే, జర్మనీ, కెనడా, యునైటెడ్ స్టేట్స్ వంటి ప్రదేశాలకు అంతర్జాతీయ రిక్రూట్మెంట్లో పెరుగుదలను చూసినట్టు కోవిడ్-19, గ్లోబల్ నర్సింగ్ ఫోర్స్ నివేదిక ఆధారంగా ఆయన చెప్పారు.
ఐసీఎన్ సమాచారం ప్రకారం.. మహమ్మారికి ముందు ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది నర్సుల కొరత ఉన్నయి. ఇందులో దాదాపు 90 శాతం తక్కువ, తక్కువ-మధ్యస్థ-ఆదాయ దేశాలలోనే ఉండటం గమనార్హం. సంపన్న దేశాలకు ఇటీవల రిక్రూట్ అయిన వారిలో కొందరు నైజీరియాతో సహా సబ్-సహారా ఆఫ్రికా నుంచి, కరేబియన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి వచ్చారని హౌవార్డ్ కాటన్ అన్నారు. సంపన్నదేశాల్లో ఆకర్షణీయమైన జీతాలు నర్సుల అటువైపు వెళ్లేలా చేస్తున్నాయని తెలిపారు. నర్సులకు ప్రాధాన్య ఇమ్మిగ్రేషన్ హౌదా ఇవ్వడం ద్వారా ఈ ప్రక్రియ సులభతరమవుతున్నదని ఐసీఎన్ నివేదిక పేర్కొన్నది.