Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేనె ఉత్పత్తి, చేపలు, పండ్ల పెంపకంపై దృష్టిపెట్టాలి..
- రాబోయే బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలి : పరిశ్రమవర్గాలు
న్యూఢిల్లీ : 'సండే హో యా మండే..రోజ్ ఖావో అండే'..అంటూ టీవీల్లో 1980 నుంచి మొదలైన ప్రచారం దేశ ప్రజలపై ఎంతో ప్రభావం చూపింది. గుడ్డు తినటం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న అభిప్రాయం ఏర్పడింది. పిల్లలకు పోషకాహారాన్ని అందించటంలో, మానసిక, శారీరక ఎదుగుదలకు గుడ్డు ఎంతగానో తోడ్పడుతుందనే అవగాహన పెరిగింది. దశాబ్దాలుగా కోళ్ల పరిశ్రమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహం గుడ్ల వాడకం పెరగడానికి దారితీసింది. అలాగే దేశంలో పాల వాడకం పెరగడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయని, ఇప్పుడు అదే రకమైన ప్రాధాన్యత, ప్రభుత్వ ప్రోత్సాహం తేనె ఉత్పత్తి, చేపలు, పండ్ల పెంపకందార్లకు ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. తేనె వాడకం, చేపలు, పండ్ల కొనుగోలు పెరిగేవిధంగా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తేనె ఉత్పత్తిదారు పంకజ్ కుమార్ మిశ్రా చెబుతున్నారు.
''భారత్‌లో తేనె తలసరి వినియోగం సుమారుగా 50 గ్రాములు మాత్రమే ఉంది. అదే ప్రపంచవ్యాప్తంగా తేనె తలసరి వాడకం 250-300గ్రాముల వరకు ఉంది. 130కోట్లకు పైగా ఉన్న జనాభాలో తేనె వాడకం చాలా తక్కువగా ఉంది. చిన్న దేశం జర్మనీలో ఏడాదికి తలసరి వాడకం 2కేజీలు. మనదేశంలోనూ తేనె వాడకం పెరిగేవిధంగా కేంద్రం చర్యలు చేపట్టాలి'' అని మిశ్రా వివరించారు. తేనె, తేనెటీగల పెంపకం కోసం ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన సూచించారు. పాల విప్లవం సంభవించినట్టుగానే 'స్వీట్ రివాల్యూషన్' రావాలని కోరారు. ఈ రంగంలో పెంపకందార్లు స్థిరమైన ఆదాయం పొందలేకపోతున్నారని, మార్కెట్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
నీలి విప్లవానికి ఎన్నో సవాళ్లు
మనదేశంలో చేపల పెంపకం పెద్ద ఎత్తున విస్తరించింది. నీలి విప్లవం 2.0, చేపల దిగుబడి పెంచే విధంగా కేంద్రం చేపడుతున్న చర్యలు పెద్దగా ఫలించటం లేదు. 'పీఎం మత్స్య సంపద యోజన' పేరుతో పథకాన్ని ప్రకటించి..కేంద్రం చేతులు దులుపుకుంది. ఈ కార్యక్రమం వల్ల పరిశ్రమలో పెంపకందార్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కాలేదని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. ఆక్వాకల్చర్‌పై కేంద్రం దృష్టిపెట్టాలని 'ఆక్వా కనెక్ట్' సీఈవో రాజామనోహర్ అన్నారు. తీర ప్రాంతాల్లో సముద్రాల నుంచి వస్తున్న చేపల్లో 90శాతం ఎగుమతి అవుతోందని, దేశ విదేశాల్లో మార్కెట్‌ను పెంచుకునే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. పెంపకందార్లకు రుణాలు పొందటం, బీమా సౌకర్యం పరిశ్రమకు మేలు చేస్తాయన్నారు.