Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడుగడుగునా ఆ పార్టీ నేతలకు అడ్డగింతలు
- యూపీ ముఖ్యమంత్రికి నిరుద్యోగ యువత భయం
- కనిపిస్తే.. తరిమికొడుతున్న స్థానిక ఓటర్లు
- దిక్కుతోచనిస్థితిలో మోడీ,యోగి బృందం
లక్నో: ప్రధాని మోడీ, కేంద్రహౌంమంత్రి అమిత్‌షా రంగంలోకి దిగినా..యూపీలో బీజేపీకి కష్టకాలం ఎదురవుతోంది.యోగి జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా ప్రజావ్యతిరేకత భగ్గుమంటోంది. బీజేపీ నేతల ప్రవేశాలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తుంటే..మరి కొన్ని బీజేపీ ఎమ్మెల్యేలను తరిమికొడుతున్న సంఘటనలతో..అధిష్టానానికి ముచ్చెమటలు పడుతున్నాయి. యూపీ సీఎం యోగి ఘజియాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభకు హాజరైనపుడు నిరుద్యోగయువత బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే విక్రమ్ సైని పరుగులు
ఇటీవల ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ఓటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, ప్రచారానికి వెళ్లిన సైనీ తన ప్రాంతంలోని మనవ్వార్ పూర్ గ్రామంలో సమావేశానికి చేరుకున్నారు. అయితే గ్రామస్తులు అడ్డుకోవటంతో..అక్కడ నుంచి జారుకోకతప్పలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, ఇందులో ఎమ్మెల్యే విక్రమ్ సైనీ కారులో చేతులు జోడించి కూర్చున్నారు.
సంజీవ్ బల్యాన్కు సెగ
గతేడాది పశ్చిమ యూపీలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు బీజేపీ నేతలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఫిబ్రవరిలో ముజఫర్‌నగర్‌లోని సోరం గ్రామంలో మంత్రి సంజీవ్ బల్యాన్‌పై ప్రజలు అడ్డుకున్నారు. సంజీవ్ బల్యాన్ ముజఫర్‌నగర్ ఎంపీ. షామ్లీలోని భైన్వాల్ గ్రామంలో కూడా సంజీవ్ బల్యాన్ రాకతో రైతులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తిరిగి ఇచ్చే వరకు ఎంఎస్పీ హామీ ఇచ్చేది లేదనీ, చెరకు ధర రాదనీ, సకాలంలో చెల్లించడం లేదనీ, రైతులపై పెట్టిన కేసులు వెనక్కి ఇచ్చేది లేదని రైతులు తెలిపారు. ఇప్పటికీ అక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పులేదని స్థానికులు అంటున్నారు.
బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు
గతేడాది మార్చి నెలలో గ్రేటర్ నోయిడాలోని బిసహదా గ్రామంలో బీజేపీ నేతలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విజయాల ప్రచారం కోసం బీజేపీ నేతలు వచ్చారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించగా, గ్రామస్థులంతా మూకుమ్మడిగా బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే, పశ్చిమ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు మోహిత్ బెనివాల్ కూడా హాజరయ్యారు.ప్రజలనుంచి వ్యతిరేక స్వరం వినిపించటంతో..బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవసాయ చట్టం, దంకౌర్ బ్లాక్ రద్దుకు వ్యతిరేకంగా గ్రామస్థులు నిరసనలు తెలిపారు.
అమ్రోహాలోనూ అదే సెగ
2020 సెప్టెంబర్ నెలలో, అమ్రోహా గ్రామమైన రసూల్పూర్ మాఫీలో, వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆగ్రహంతో ఉన్న ప్రజలు బీజేపీ నాయకులకు ప్రవేశం లేదు అనే బోర్డును పెట్టారు. ఇక్కడి ప్రజలు బీజేపీ నేతలపై గుర్రుమంటున్నారు.
బిజ్నోర్‌లో హెచ్చరిక బోర్డు
యూపీలోని బిజ్నోర్ జిల్లా... 2018 అక్టోబర్... బస్తా ప్రాంతంలోని గ్రామాలలో రైతులు బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా హెచ్చరిక బోర్డు పెట్టారు, అందులో బీజేపీ నేతలు రైతు గ్రామానికి రావడాన్ని కచ్చితంగా నిషిద్ధం అని రాశారు. యూపీ సరిహద్దులో కిసాన్ క్రాంతి యాత్ర సందర్భంగా రైతులపై లాఠీచార్జి చేయడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాకీయు ప్రాంతాని కిసాన్ క్రాంతి యాత్ర యూపీ సరిహద్దుకు చేరుకున్నప్పుడు...యోగి ప్రభుత్వం రైతులను ఢిల్లీ సరిహద్దుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నది. నిరాయుధ రైతులపై నీటి ఫిరంగులు, బాష్పవాయువును ప్రయోగించడమే కాకుండా లాఠీచార్జి చేసింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తా ప్రాంతంలోని సన్సార్‌పూర్ గ్రామస్థులు బీజేపీకి వ్యతిరేకంగా గోడ పెయింటింగ్ కూడా చేశారు. అచ్చం ఇలాగే గ్రేటర్ నోయిడా, దనౌరా గ్రామ రైతులు కూడా బీజేపీ సభ్యులెవరూ కచ్చితంగా ఎంట్రీ లేదని గ్రామం వెలుపల బోర్డు పెట్టారు. బీజేపీ ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల పరిస్థితి దారుణంగా ఉన్నదనీ, అభివృద్ధి పేరిట పంటల్ని నాశనం చేసి అరాచకం సృష్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటు గ్రామాల్లో..ఇటు పట్టణాల్లోనూ ఓటర్ల తిరుగుబాట్లు వ్యక్తమవుతున్నతీరు బీజేపీ అధిష్టానాన్ని గుక్కతిప్పుకోనీయకుండా చేస్తోందని ఢిల్లీలో వినిపిస్తోంది.