Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) పరీక్షల్లో అక్రమాలపై బీహార్‌లో చల్లారని అగ్గిలా మండుతోంది. గయలో రైలు పట్టాలపై ఆందోళనలు చేపట్టిన ఉద్యోగార్థుల్లో కొందరు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆగిఉన్న ఓ పాసింజర్ రైలును రాళ్లు, కర్రలతో ధ్వంసం చేసి ఆపై నిప్పంటించారు. అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలు ఆర్పినా..బోగి పూర్తిగా కాలిపోయింది. బీహార్,యూపీలోనూ అభ్యర్థులు నిరసనకు దిగటంతో పాటు..ఆయా మార్గాల్లోని రైలు పట్టాలపై బైటాయించారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో రెండోరోజూ ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విద్యార్థులను నచ్చజెప్పకుండా...పోలీసులు దురుసుగా వ్యవహరించటం వల్ల కూడా..నిరుద్యోగయువత మరింత ఆగ్రహానికి లోనైంది. దాంతో పలు రైళ్లపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఇప్పటికే ప్రయాగ్ రాజ్‌లో వెయ్యిమందిపై కేసులు బుక్ చేయగా..ఆరుగురు పోలీసులపై వేటు వేసింది.ఇదిలా ఉంటే పరీక్షల్లో అవకతవకలపై అభ్యర్థుల ఆందోళనల దృష్ట్యా.. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ)తో పాటు లెవల్-1 పరీక్షలను నిలిపివేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల పరిధిలోని పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు, ఫెయిల్ అయినవారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
రగడ ఎందుకంటే..
ఆర్ఆర్బీ 2019లో సీబీటీ-1 పరీక్షను నిర్వహించిందని.. ఆ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అప్పటినుంచి సరైన రీతిలో ఉత్తీర్ణత జాబితాను ప్రకటించలేదని.. ఈలోపే సీబీటీ-2 పరీక్ష నిర్వహణకు సిద్ధమైందని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఈ పరీక్షను రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.