Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీకి రూ. 2.64 లక్షల కోట్లు అవసరం
- ఇప్పటికే రూ. 13 వేల కోట్లకు చేరువలో బకాయిలు
- పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లారుమెంట్ గ్యారెంటీ సూచన
న్యూఢిల్లీ : మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్ఆర్ఈజీఏ) కింద పనికావాలని ఒత్తిడి ఎక్కువవుతోంది. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఆ చట్టాన్ని నీరుగార్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బడ్జెట్లో కేటాయించిన నిధులు, విడుదల చేసిన ఫండ్స్ మధ్య సగానికి పైగా కోతపెడుతోంది. గత రెండేండ్లలో కరోనా విజృంభణతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. పస్తులుండలేని పేదజనం.. ఎంఎన్ఆర్ఈజీఏను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎం ఎన్ఆర్ఈజీఏకి రూ. 2.64 లక్షల కోట్లు అవసరమని పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లారుమెంట్ గ్యారెంటీ (పీఏఈజీ) సూచిం చింది. పార్లమెంటులో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమ యం దగ్గర పడుతున్న సందర్భంలో పీఏఈజీ ఈ సూచన చేసింది. ఉపాధి హామీ పథకానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2.64 లక్షల కోట్లు అవసరమని పీఏఈజీ సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద లబ్ది పొందుతున్న గృహాల గణాంకాలను ఆధారంగా చేసుకొని ఈ అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉపాధి హామీ కోసం రూ. 1.5 లక్షల కోట్లు కేటాయించాలని గతంలో పీఏఈజీ, ఎన్ఆర్ఈజీఏ సంఘర్ష్ మోర్చాలు సూచించాయి. కరోనా విజృంభించిన ఆ సమయంలో ఉపాధి హామీ కాస్త ఉపశమనాన్ని కలిగించింది. ఆ సమయంలో ఎందరికో ఉపాధిని కలిగించింది. అయితే, డిమాండ్ ఇంత అధికంగా ఉన్నప్పటికీ మోడీ సర్కారు మాత్రం ఉపాధి హామీకి అంత మొత్తంలో నిధులను విదల్చలేదు. కేవలం రూ. 73 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నది. అయితే ఇది 2020-21లో ఎన్ఆర్ఈజీఏ సవరణ బడ్జెట్ కంటే 34 శాతం తక్కువ కావడం గమనార్హం.
కేటాయింపుల్లో 20 శాతం బకాయిలకే..!
మోడీ సర్కారు తగిన కేటాయింపులు జరపకపోవడంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధభాగంలో ఎన్ఆర్ఈజీఏ నిధులు అడుగంటాయి. పీఏఈజీ సమాచారం ప్రకారం పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు నెగెటివ్ బ్యాలెన్స్‌ను నమోదు చేశాయి. మరోపక్క, బడ్జెట్లో 20 శాతం వరకు బకాయిల చెల్లింపులకే వెళ్లాయని పీఏఈజీ పేర్కొన్నది. చెల్లించని బకాయిలు ఈ ఏడాదిలో ఇప్పటికే రూ. 12,494 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే ట్రెండ్ కొనసాగితే అది రూ. 21వేల కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. చెల్లించాల్సిన పరిహారంలో 1.69 శాతం మాత్రమే చెల్లింపునకు నోచుకున్నదని ప్రభుత్వ సమాచారాన్ని ఉటంకిస్తూ పీఏఈజీ వెల్లడించింది. నిర్దేశిత గడువులోగా వేతనాలో చెల్లింపుల విషయలో కేంద్రం ఆలస్యం చేస్తున్నదని వివరించింది. మోడీ సర్కారు చర్యలు 'ఉపాధి హామీ'ని నిర్వీర్యం చేసే విధంగా కనిపిస్తున్నాయని సామాజిక కార్యకర్తలు, పౌరసంఘాల నాయకులు ఆరోపించారు. రాబోయే బడ్జెట్లోనైనా సరైన కేటాయింపులు జరిపి ఉపాధి హామీని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.